‘సూపర్’ మాయ | Magic To set up super-specialty | Sakshi
Sakshi News home page

‘సూపర్’ మాయ

Sep 10 2015 2:20 AM | Updated on Nov 9 2018 5:52 PM

నగరంలో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటుపై పాలకులు ఇప్పటివరకు చెబుతున్నవన్నీ మాయమాటలేనని తేలిపోయింది

లబ్బీపేట : నగరంలో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటుపై పాలకులు ఇప్పటివరకు చెబుతున్నవన్నీ మాయమాటలేనని తేలిపోయింది. మంగళవారం విజయవాడ ైవె ద్య కళాశాలను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూపర్ బ్లాక్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులపై ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రకటించడంతో అసలు విషయం బయట పడింది. ఎయిమ్స్‌కు ఇంకా స్థల నిర్ధారణే జరగలేదని, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదని తేలిపోయింది.  

 ఇంతవరకు విల్లింగే ఇవ్వలేదు...
 కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో దేశంలోని పలు వైద్య కళాశాలల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రధాన మంత్రి  శ్వాస్త్ సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) పథకం ద్వారా రాష్ట్రంలోని అనంతపురం, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు రూ.150 కోట్లు కేటాయించింది. ఆ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 20 శాతం చెల్లించాల్సి ఉంది. అంటే రూ.30 కోట్లు మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాలి.

రెండు కళాశాలలకు సంబంధించి కేంద్రం కేటాయించిన నిధులకు మ్యాచింగ్ గ్రాంటు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు సమ్మతి చెప్పలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విషయమై వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని విలేకరులు ప్రశ్నించగా, నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విల్లింగ్ ఇచ్చిన వెంటనే ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్ర విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు తేటతెల్లమైంది.  

 గత అనుభవాలు పునరావృతమయ్యేనా?
 ఐదేళ్ల కిందట సిద్ధార్థ వైద్య కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థుల సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అందులోభాగంగా తొలి విడతగా రూ.7 కోట్లు కేటాయించగా, వాటికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో రెండో విడత నిధులు నిలిచిపోయాయి. పక్క రాష్ట్రాలు మాత్రం రెండు, మూడు విడతల నిధులను సైతం సద్వినియోగం చేసుకున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఇప్పుడు విల్లింగ్ ఇచ్చినా నిధులు విడుదల చేయకపోతే, నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సొంత జిల్లాలోని ఆస్పత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇతర  జిల్లాల్లో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement