
పాడేరు/అరకులోయ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని, ఎవరైనా శిక్ష తప్పదని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఆయన పాడేరులోని కిడారి, అరకులో సీవేరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నెల 14న అరకులో నిర్వహించనున్న కిడారి, సోమల స్మారక సం తాప కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడారి, సోమ ల హత్యల వెనుక ఎవరున్నారో బయటకు వస్తుందని, దీనిపై సిట్ విచారణ కొనసాగుతోందన్నారు.
సొంత పార్టీలోని వ్యక్తులే ఈ హత్యలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనివల్లే సిట్ నివేదిక బయటకు రాకుండా చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సొంత ఎమ్మెల్యేను చంపుతారా.. అంటూ నివేదిక రాకుండా మాట్లాడడం, అర్థంపర్థం లేని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక రాకుండా దీనిపై మాట్లాడటం సబబు కాదన్నారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నక్కా ఆనందబాబు పాడేరు, అరకు ప్రాంతాల్లో రోడ్డు మార్గంలో పర్యటించారు.