16న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా

List of YSRCP candidates on 16th - Sakshi

ఇడుపులపాయలో విడుదల చేయనున్న వైఎస్‌ జగన్‌

అదేరోజు నుంచి ఎన్నికల ప్రచార భేరి

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తొలి బహిరంగ సభ

ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సభల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌

25న నామినేషన్ల పర్వం ముగిశాక ప్రతి రోజూ 4 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొనే అవకాశం

ప్రచార బరిలో వైఎస్‌ విజయమ్మ, షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఈ నెల 16న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో వెల్లడిస్తారు. అదే రోజు నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగిస్తారు. 16వ తేదీ ఉదయం వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఉదయం 10.26 గంటలకు ప్రచారానికి బయలుదేరుతారు. వాస్తవానికి అభ్యర్థుల జాబితా బుధవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ పార్టీలో చేరికలు ఎక్కువగా ఉన్నందున ముహూర్త సమయం దాటిపోయిందని, అందువల్ల ఈ వాయిదా అవసరమైందని పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

రోజుకు మూడు సభలు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోజుకు మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ బుధవారం వెల్లడించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో జగన్‌ ప్రచార షెడ్యూలును పూర్తిగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. 16వ తేదీన తొలి రోజున గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో తొలి సభ ఉంటుందన్నారు. ఆరోజు ఒకే ఒక్క సభతో ప్రచారం ముగిస్తారని, ఆ మరుసటి రోజు నుంచి ప్రతిరోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. రెండవ రోజున నర్సీపట్నం, నెల్లిమర్ల, పి.గన్నవరం నియోజక వర్గాల్లో సభలుంటాయని తెలిపారు. ఈ నెల 25న నామినేషన్ల పర్వం ముగిశాక ప్రతిరోజూ నాలుగు నియోజక వర్గాల్లో జరిగే సభల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి హెలీకాప్టర్‌లో వెళతారన్నారు. ప్రతిరోజూ హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లి దిగాక.. బస్సులో ప్రయాణించి సభల్లో ప్రసంగిస్తారని తెలిపారు. జగన్‌ ఎన్నికల ప్రచార సభల్లో కనీసం 70 నుంచి 80 నియోజక వర్గాలు ఉంటాయని, ఇందులో పాదయాత్రలో వెళ్లని నియోజకవర్గాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. జగన్‌ తన పధ్నాలుగు నెలల పాదయాత్రలో 13 జిల్లాల్లోని 134 నియోజక వర్గాల్లో తిరిగారని గుర్తు చేశారు.

విజయమ్మ, షర్మిల ప్రచారం
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సోదరి షర్మిల కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని రఘురామ్‌ తెలిపారు. వారి పర్యటన వివరాలను కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో తమ మేనిఫెస్టో ఎలా ఉంటుందో.. అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమానికి తాను ఏం చేస్తారో విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ ఎన్నికల ప్రచారం ద్వారా మరోసారి ప్రజలకు వివరించి ఓట్లడుగుతారని ఆయన తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top