గ్యాస్‌ లీక్‌ వార్తలపై ఎల్జీ పాలిమర్స్‌ వివరణ

LG Polymers Explanation On Gas Leakage Second Time - Sakshi

అర్ధరాత్రి మళ్లీ గ్యాస్‌ లీక్‌ కాలేదు: ఎల్జీ పాలిమర్స్‌

రాత పూర్వకంగా పత్రకా ప్రకటన విడుదల చేసిన ఎల్జీ పాలిమర్స్

సాక్షి, విశాఖపట్నం : అర్ధరాత్రి సమయంలో ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమ నుంచి మరోసారి గ్యాస్‌ లీక్‌ అయ్యిందని వచ్చిన వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది. అలాంటి సంఘటన ఏమీ జరగలేదని సంస్థ శుక్రవారం రాత పూర్వకంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకై 12మంది మృతి చెందగా, వందలాదిమంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఎల్జీ పాలిమర్స్ సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గాలిలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే స్టెరైన్ ఉండటాన్ని గుర్తించామని విశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ రవీంద్రనాథ్‌ తెలిపారు. (గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష)

వెంకటాపురం పరిసర ప్రాంతాలలో రెండు రోజులుగా ఆరు ప్రాంతాలలో గాలిలో ఎప్పటికపుడు వాయువుల శాతాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నిన్నటితో (గురువారం) పోలిస్తే ఇవాళ చాలా తక్కువ మోతాదులో స్టెరైన్‌ను గాలిలో గుర్తించామని తెలిపారు. నిపుణులు, కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లతో కలిసి పరిస్ధితిని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై శుక్రవారం ఐఏఎస్‌ల హైపవర్‌ కమిటీ విచారణ ప్రారంభమైంది. (గ్యాస్‌ లీకేజీ ఘటన : హైపవర్‌ కమిటీ ఏర్పాటు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top