‘లేసు’ కార్మికులకు అందని వైద్యం | LeSu Workers not available Treatment | Sakshi
Sakshi News home page

‘లేసు’ కార్మికులకు అందని వైద్యం

Sep 29 2014 1:07 AM | Updated on Oct 9 2018 7:52 PM

‘లేసు’ కార్మికులకు అందని వైద్యం - Sakshi

‘లేసు’ కార్మికులకు అందని వైద్యం

లేసు అల్లికలకు నరసాపురం ప్రాంతం వందేళ్లుగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం లో అల్లిన లేసులు ప్రపంచ ఖ్యాతి గడించాయి. ఇక్కడి అల్లిన లేసులు అమెరికా, ఇంగ్లడ్, చైనా తదితర దేశాలకు

నరసాపురం రూరల్ : లేసు అల్లికలకు నరసాపురం ప్రాంతం వందేళ్లుగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం లో అల్లిన లేసులు ప్రపంచ ఖ్యాతి గడించాయి. ఇక్కడి అల్లిన లేసులు అమెరికా, ఇంగ్లడ్, చైనా తదితర దేశాలకు ఎగుమతి అవుతాయి. లేసులు అల్లే మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర హస్తకళల శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా పథకాన్నిప్రారంభించారు. లేసు అల్లే మహిళలతోపాటు వారి కుటుంబ సభ్యులకు  ఏడాదికి రూ.15 వేల వరకూ వైద్య బీమాను ఈ పథకంద్వారా వినియోగించుకోవచ్చు. 2006లోప్రారంభించిన ఈ పథకం ద్వారా 17వేల 400 మంది లేసు అల్లే మహిళలకు వైద్య బీమా కార్డులు అందజేశారు. ఈ ఏడాది మే 31తో బీమా కార్డుల గడువు ముగిసింది. దీంతో ఈ మహిళలకు నాలుగు నెలలుగా వైద్యం అందని ద్రాక్షగా మారిం ది.
 
 ఈ కార్డులను కలిగి ఉన్న వారికి నరసాపురం, పాలకొల్లు, తణుకు, భీమవరం తదితర ప్రాంతాలలో ఉచిత వైద్యం అందేది. తూర్పు, పళ్చిమ గోదావరి జిల్లాల్లోని 14 మండలాలలో లేసులు అల్లే మహిళలు ఎక్కువగా ఉన్నారు. లేసు ఎగుమతుల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ఆరోగ్య బీమా గడువు ముగిసి 4 నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారులేరు. ఈ మహిళలకు చేయూత నివ్వాల్సిన కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ వీరివైపు కన్నెత్తి చూడటం లేదు.
 
 ఇప్పటి వరకూ 1,500 మంది  మహిళలకు వైద్య ఖర్చులు బీమా కంపెనీల నుంచి క్లెయిం కావాల్సి ఉండగా, వాటిని ఇప్పించేందుకు కూడా సంబంధిత శాఖ అధికారులు ప్రయత్నించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నరసాపురం మండలం రుస్తుంబాదలోని లేసుపార్కు కేంద్రంగా ఈ పథకం కొనసాగేది. తమకు అందాల్సిన వైద్య ఖర్చుల క్లెయిమ్‌ల గురించి మహిళలు ఈ కేంద్రం అధికారులను ప్రశ్నిస్తుంటే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారని లేసు కార్మికులైన మహిళలు చెబుతున్నారు. ఆరోగ్య బీమాపై గతంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమకు హామీలు ఇచ్చారని, వాటిని నిలబెట్టుకోవాలని మహిళలు కోరుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement