నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ | Chandrababu Govt: Aarogyasri services to be closed from 1st April 2026 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

Apr 1 2026 3:21 AM | Updated on Apr 1 2026 3:22 AM

Chandrababu Govt: Aarogyasri services to be closed from 1st April 2026

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు

రూ.3 వేల కోట్ల బకాయిలతో ఆస్పత్రులు నడపలేని పరిస్థితి

వారం రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు 

ఆస్పత్రుల యజమానులతో చర్చించని బాబు సర్కారు

ఆరోగ్యశ్రీ పథకంపై ఆది నుంచీ చంద్రబాబుది ఇదే తీరు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.40 కోట్లకుపైగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోను­న్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్లు తిరక్కుండానే ఆస్పత్రుల యాజమాన్యాలు మూడో­సారి సమ్మె బాట పట్టాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పడింది. రోజు రోజుకూ పేరుకుపోతున్న బకాయిలతో ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతోందని కొద్ది నెలలుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బకాయిలు తీర్చకపోతే ఏప్రిల్‌ 1వ తేదీ (బుధవారం) నుంచి సేవలు నిలిపేసి, సమ్మెలోకి వెళతామని వారం కిందటే ‘ఆశ’ అల్టిమేటం జారీ చేసింది. వారితో చర్చలు జరిపి, సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. వెరసి పేద, మధ్య తరగతి ప్రజల ఉచిత వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. 

దగా చేసిన ప్రభుత్వం
2024లో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేయడం మొదలెట్టారు. ఈ పథకాన్ని రూపుమాపే ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కేంద్రం అమలు చేసే పీఎంజేఏవై పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని లాంటి వారి ద్వారా ప్రకటనలు చేయిస్తూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్‌లు, విలాసాలు, యోగా డే వంటి ఈవెంట్స్‌ కోసం మాత్రం రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. 

బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రులు నిర్వహించలేకపోతున్నామని గతేడాది యజమానులు రోడ్లెక్కారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రైవేట్‌ వైద్యులు ధర్నా చౌక్‌లో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం.. బకాయిలన్నింటినీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) చేస్తామని నమ్మబలికింది. ఆశ ప్రతినిధులతో చర్చల అనంతరం ఓటీఎస్‌పై వైద్య శాఖ మంత్రి సైతం ప్రకటనలు చేశారు. డిసెంబర్‌లోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఆ హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం దగా చేసింది. బకాయిలు చెల్లించకుండానే బీమా విధానం అమలుకు వైద్య శాఖ టెండర్లు కూడా పిలిచింది. ఈ నేపథ్యంలో బకాయిలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు సిద్ధం అయ్యాయి.  
దీనావస్థలో పేదలు
చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో అత్యధిక శాతం అనధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను ఎత్తేశాయి. జబ్బు బారినపడిన పేదలు చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళితే ఉచిత వైద్య సేవలు అందించలేమని చెప్పేస్తున్నాయి. దీంతో సొంతంగా డబ్బు కట్టి వైద్యం చేయించుకోవడానికి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 
⇒ 2014–19 మధ్య కూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పట్లో చంద్రబాబు అటకెక్కించారు. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయి పెట్టారు.

⇒ అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బాబు పెట్టిన బకాయిలను చెల్లించింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదారు. రూ.25 లక్షల వరకు వైద్య సేవల పరిమితితో పథకాన్ని బలోపేతం చేసి, 325 ప్రొసీజర్‌లను పథకం పరిధిలోకి తెచ్చారు. శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో వారికి ఇల్లు గడిచేలా రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.ఐదు వేల చొప్పున ఆరోగ్య ఆసరా సాయం అందించారు. ఈ సాయాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా ఎత్తేయడంతో పాటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement