ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వామపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
చంద్రబాబు ఎన్నికల హామీలపై విస్తృత చర్చ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వామపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ముఖ్యం గా రైతు రుణమాఫీపై రోజుకోమాటతో గందరగోళం సృష్టిస్తున్నారని అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. మొత్తం వ్యవసాయ రుణాలు రూ. 87 వేల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.14వేల కోట్లు రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఆయా మొత్తాలను కుదించడాన్ని ఆక్షేపిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికల హామీలు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు సోమవారం విజయవాడలో భేటీ అవుతున్నాయి. ఏపీ విభజనానంతరం జరుగుతున్న వామపక్షాల తొలి మహా భేటీకి సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ(చంద్రన్న), సీపీఐ(ఎంఎల్), ఎస్‌యూసీఐ, ఎంసీపీఐ, ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్పీ, ఎంఎల్ కమిటీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీల నేతలు హాజరవుతున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు.
నేటి నుంచి రైతు సంఘం పోరుబాట
రైతు సమస్యలను పరిష్కరించాలని సోమవారం నుంచి 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య తెలిపారు. పలు సమస్యలపై జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు వివరించారు.