పట్టని ప్రయోగం

Lab Equipment Shortage in YSR kadapa Inter College - Sakshi

ప్రభుత్వ కళాశాలల్లో వసతులు అంతంతమాత్రం

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అరకొరగా ప్రయోగాలు..

రేపటి నుంచి ప్రాక్టికల్స్‌ ప్రారంభం

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు

విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్‌ విద్య కీలకం. చదువుతోపాటు ప్రయోగాలు చేయాల్సి ఉంది.  లేకపోతే ఆ ప్రభావం మార్కుల మీదు పడుతుంది.ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ఎంపీసీ వారికి రెండు, బైపీసీ వారికి 4 సబ్జెక్టులకు మార్కులు ఉంటాయి.ప్రయో పరీక్షలు  జంబ్లింగ్‌ విధానంలో జరుగుతున్నా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు అంతంగా స్పందించడం లేదు. చివరి దశలో నామమాత్రంగా ప్రయోగపరీక్షలు చేయిస్తూ పరీక్షల సమయంలో పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో కూడా అంతంత మాత్రంగానే చేయిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో ల్యాబ్‌లకు సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజంపేట ఉర్దూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ల్యాబ్‌కు గది లేక పరికరాలను  బీరువాలో ఉంచి ప్రాక్టికల్స్‌ సమయంలో  బయటికి తీయాల్సిన పరస్థితి నెలకొంది. ఫిబ్రవరి  1 నుంచి ప్రారంభంకానున్న ప్రయోగ పరీక్షల దృష్ట్యా ప్రత్యేక కథనం..

కడప ఎడ్యుకేషన్‌ : ఈ ఏడాది ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 174 కళాశాలల్లో 45 వేలమంది విద్యార్థులు ఉన్నారు.వీరిలో 13,251 మంది ఎంపీసీ, బైపీసీ చదువుతున్నారు. జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఐఓ రవి తెలిపారు.

నాలుగు విడతల్లో పరీక్షలు
ప్రాక్టికల్‌ పరీక్షలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. 1 నుంచి 5 వరకు మొదటి విడత, 6 నుంచి 10 వరకు రెండో విడత, 11 నుంచి 15వరకు మూడో విడత, 16 నుంచి 20 వరకు నాలుగో విడత పరీక్షలు జరగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ సారీ జంబ్లింగ్‌ విధానంలోనే
ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించనున్నారు. కార్పొరేట్‌ యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా జంబ్లింగ్‌ విధానంలోనే ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బందిని కూడా ఏరోజుకారోజు మార్చి అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నారు.

ప్రశ్నపత్రాలు అన్‌లైన్‌లో
ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఇంటర్‌ బోర్డు నూతన విధానానికి తెరలేపింది. గతంలో పోస్టల్‌ ద్వారా పరీక్ష పత్రాలు ఆయా కేంద్రాలకు పంపించేవారు. దీంతో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నట్లు విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షలకు 30 నిమిషాల ముందు సంబంధిత కేంద్రంలో పశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు చేపట్టారు.

జిల్లాలో పరిస్థితి
జిల్లాలో చాలా కళాశాలల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట మండలంలోని ఉర్దూ జూనియర్‌ కళాశాలలో ల్యాబ్‌ సౌకర్యం లేదు. పరిరకాలను బీరువాలో ఉంచుకుని ల్యాబ్‌ ఉన్న రోజు బయటకు తీసి టేబుల్‌పైన పెట్టుకుని ప్రయోగాలు చేయించి తిరిగి బీరువాలో భద్రపరచుకునే పరిస్థితి ఉంది. మైదుకూరు ఉర్దూ జూనియర్‌ కళాశాలకు సొంతభవనాలు లేవు.స్థానిక కొత్తకొట్టాలులో ఉన్న ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 20 మంది ఉన్నారు.ఇక్కడ ల్యాబ్‌ సౌకర్యం మాత్రం లేదు.అధ్యాపకులు సొంత డబ్బులతో పరికరాలను కొని అరకొరగా ప్రయోగాలను చేయిస్తున్నారు. జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ల్యాబ్‌రూమ్‌ శిథిలావస్థకు చేరుకుంది. గది పైకప్పు పెచ్చులూడింది.కడప బాలుర, బాలికల జూనియర్‌ కళాశాల, ఓబులవారిపల్లె, రాజంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పొద్దుటూరులోని పలు కళాశాలల్లో ల్యాబ్స్, పరికరాలు బాగానే ఉన్నాయి. రాయచోటి, నందలూరు, మైలవరం, పెండ్లిమర్రి, పుల్లంపేట, మైదుకూరులలో పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిసింది.

భయం భయంతో
మా కళాశాలలో ల్యాబ్‌ సౌకర్యం లేదు. దీంతో పరికరాలను బీరువాలో ఉంచుతాం. ల్యాబ్‌ క్లాస్‌ ఉన్నప్పడు వాటిని బయటకు తీసి చిన్న టేబుల్‌పైన పెట్టుకుని భయం భయంగా ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల స్పందించి వసతులన కల్పనకు చర్యలు తీసుకోవాలి.     – షేక్‌ తాసిఫ్,ఉర్దూ జూనియర్‌ కళాశాల, రాజంపేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top