lab equipment
-
డయాగ్నొస్టిక్స్ డల్!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్’ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. రూ. కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడంతో చాలా కేంద్రాల్లో పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరికొన్ని చోట్ల వైద్య పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరత కూడా నెలకొంది. దీంతో చాలా జిల్లాల్లో పేదలు అనివార్యంగా రూ. వేలు ఖర్చుపెట్టి మళ్లీ ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 32 జిల్లాల్లో హబ్స్.. 1,546 చోట్ల స్పోక్స్ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద హబ్ అండ్ స్పోక్ విధానంలో హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ప్రధాన హబ్‌గా తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ఏర్పాటైంది. ఆపై రాష్ట్రవ్యాప్తంగా హబ్‌లను విస్తరించారు. ప్రస్తుతం నారాయణపేట, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 32 బయో కెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, పాథలాజీ ల్యాబ్స్‌తో కూడిన హబ్స్ ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానాలు, కమ్యూనిటీ సెంటర్లు మొదలైన 1,546 చోట్ల స్పోక్స్ (చిన్న కేంద్రాలు)ను ఏర్పాటు చేశారు. తక్షణమే వచ్చే పరీక్షల ఫలితాలను స్పోక్స్‌లలో, ఇతర వైద్య పరీక్షలను హబ్‌లలో నిర్వహిస్తున్నారు.పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ పరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు 32 హబ్‌లలో ఉన్నాయి. సాధారణ మధుమేహ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు మొదలుకొని మూత్రపిండాల వ్యాధి నిర్ధారణకు క్రియాటిన్ పరీక్షల వరకు, కేన్సర్ పరీక్షకు వినియోగించే సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల వరకు హబ్‌లలో అందుబాటులో ఉన్నాయి. పాథాలజీ, రేడియాలజీ సేవలు, అ్రల్టాసౌండ్, టెలి ఈసీజీ, ఎక్స్‌రే, మామోగ్రామ్, 2డీ ఎకో పరీక్షలన్నీ ఈ కేంద్రాల్లో జరుగుతాయి. ఏదైనా తగ్గని జబ్బుతో రోగి బాధ పడుతుంటే ఆ జబ్బు మూలాలను కనుక్కొని, తగిన మందులు సిఫారసు చేసేందుకు వీలుగా ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’టెస్టులు కూడా ఈ హబ్‌లలో జరిపేందుకు వీలుంది. ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టుల కొరతతో.. రాష్ట్రవ్యాప్తంగా 32 హబ్‌లలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లలో ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’పరీక్షల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన వైద్య పరికరాలను తెచ్చిపెట్టారు. అందుకు సంబంధించిన వైద్య పరీక్షలను ల్యాబ్ టెక్నీషియన్లు నిర్వహిస్తే వాటిని మైక్రోబయోలజిస్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్‌తోపాటు కొన్ని పాత జిల్లా కేంద్రాలల్లోని హబ్‌లలో తప్ప ఎక్కడా మైక్రోబయోలజిస్టులు లేక ఈ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే కేన్సర్‌ను నిర్ధారించేందుకు రూ. 50 లక్షల చొప్పున హబ్‌లలో ఏర్పాటు చేసిన సీరం–ఎలక్రో్టఫొరెసిస్ యంత్రాలకు అవసరమైన రీఏజెంట్లు (రసాయనాలు) అందుబాటులో లేక చాలా వరకు పరికరాలు వృథాగా పడి ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కొన్ని టెస్టులతోనే సరి.. ప్రతి హబ్‌లో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీకి సంబంధించి 134 రకాల వైద్య పరీక్షలు జరగాల్సి ఉండగా చాలా హబ్‌లలో 30–40 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతోపాటు రేడియాలజిస్టులు, మైక్రోబయోలజిస్టులు, ఇతర డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. హబ్‌లపై సన్నగిల్లుతున్న నమ్మకం వివిధ హబ్‌లలో తరచూ పరీక్షల ఫలితాలు ఒకరివి మరొకరికి మారిపోతుండటంతో ప్రజల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌పై విశ్వాసం సన్నగిల్లుతోంది. స్పోక్స్ (చిన్న కేంద్రాలు)లో బీపీ, షుగర్ మినహా అన్ని పరీక్షలను హబ్‌లకే పంపుతుండగా అక్కడ పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. ఆ రిపోర్టులను తీసుకొస్తేనే పీహెచ్‌సీల్లో చూపించుకొనే పరిస్థితి ఉండటంతో గ్రామాల్లో చాలా మంది ఆర్ఎంపీల ద్వారా జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. పీహెచ్‌సీల్లో సమయానికి డాక్టర్లు ఉండకపోవడం కూడా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడానికి కారణమవుతోంది. కాగా, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత నేపథ్యంలో తాజాగా 700 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. ⇒ ఖమ్మంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్‌లో రీ ఏజెంట్ల కొరతతో కేన్సర్‌కు సంబంధించి మూడొంతుల టెస్ట్‌లు జరగడం లేదు. ⇒ అక్కడ 134 రకాల పరీక్షలకుగాను 38 పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని వైద్య పరికరాలు లేకపోవడమే అందుకు కారణం. ⇒జిల్లాలోని స్పోక్స్‌లలో రీ ఏజెంట్ల కొరతతో ఎక్కడా డయాగ్నస్టిక్ టెస్ట్‌లు నిర్వహించడం లేదు. శాంపిల్స్ సేకరించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని హబ్‌కు పంపుతున్నారు. ⇒ జనగామ జిల్లాలోని హబ్‌లో వైద్య పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టులు అందుబాటులో లేక మైక్రోబయోలజీ సంబంధిత పరీక్షలు జరగడం లేదు. ⇒ పీహెచ్‌సీల నుంచి తీసుకున్న తాత్కాలిక సిబ్బందితోనే బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. కేన్సర్‌కు సంబంధించి సీఏ 125, సీఈఏ, పీఎస్ఏ మూడు టెస్టులు ఇప్పటి వరకు 30 వరకు చేశారు. ⇒ ఈ హబ్‌లో 17 రకాల మిషన్లతో రోజుకు 1,659 పరీక్షలను చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ⇒ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్ హబ్‌లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల కోసం పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఉంచేందుకు సరైన బిల్డింగ్ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ⇒ నిర్మల్ జిల్లాలో మైక్రోబయాలజిస్టులు, పాథాలజిçస్టులు లేరు. కేన్సర్ టెస్టులు చేయడం లేదు. బయోకెమిస్ట్రీ, థైరాయిడ్, సీబీపీ, డెంగీ, థైరాయిడ్ టెస్టులను మాత్రం చేస్తున్నారు. ⇒ మంచిర్యాల టీ హబ్‌లోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల పరికరాలు ఉన్నా సిబ్బంది లేక దాన్ని వాడట్లేదు. అక్కడ మైక్రోబయోలజిస్ట్ మాత్రం ఉన్నారు. బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాలు ఉన్నా సిబ్బంది లేరు. కేన్సర్ టెస్ట్‌కు ఉపయోగించే రీ ఏజంట్లు ఉన్నా.. టెస్టులు చేసే వారు లేరు. 134 రకాల పరీక్షలకుగాను 76 పరీక్షలు చేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని 32 హబ్స్, 1,546 స్పోక్స్‌లలో రోగులకు అన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మైక్రోబయోలజీస్టులు లేనిచోట జిల్లా వైద్య కళాశాల అనుబంధ డీఎంఈ ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటున్నాం. సీరం–ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్ష 5 జిల్లాల హబ్స్‌లో జరుపుతున్నాం. ప్రిస్క్రిప్షన్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. ప్రతి డయాగ్నస్టిక్ హబ్‌లో 10 నుంచి 20 మంది సిబ్బంది నమూనాలు తీసుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ ఏడాది డీఎంఈ, టీవీవీపీ ఆసుపత్రుల నుంచి సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్నాం. – ఆర్.వి. కర్ణన్, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ -
ప్రాక్టికల్ మాయ
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ అంతా మాయగా మారింది. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు మచ్చుకైనా కనిపించవు. ఉన్న వాటిల్లో పరికరాల బూజు దులపని పరిస్థితి. తరగతులు ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఒక్క ప్రయోగం కూడా నిర్వహించని దుస్థితి ఉంది. సబ్జెక్టుల వారీగా వారానికి రెండు క్లాసులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కటంటే ఒక్క క్లాసు కూడా జరగలేదు. ఓ వైపు విద్యార్థుల్లో ఆందోళన నెలకొనుండగా.. మరోవైపు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): జిల్లాలో 174 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ 58, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు 116 ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి ప్రభుత్వ కళాశాలలు 26, ఎయిడెడ్ కళాశాలలు 11, మోడల్ స్కూళ్లు 7, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 11, ఏపీ రెసిడెన్షియల్ కళాశాల 1, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు 2 ఉన్నాయి. ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రథమ, ద్వితీయసంవత్సరానికి సంబంధించి బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ కళాశాలలో ప్రాక్టికల్స్ చేపట్టలేదని అధ్యాపకులే చెప్పడం గమనార్హం. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు బ్రాంచీల పేరుతో పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేశాయి. బ్రాంచీల్లో ఎక్కడా ప్రయోగశాలలు లేవని తెలుస్తోంది. నెలకు బైపీసీకి 32, ఎంపీసీకి 16 క్లాసులు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు వారానికి రెండు సార్లు ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. అంటే నాలుగు సబ్జెక్టులకు 8 క్లాసులు ఉంటాయి. ఈ లెక్కన నెలకు బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ జువాలజీలకు సంబంధించి 32, ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్టీలకు సంబంధించి 16 ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ కొంత మెరుగుగా ఉంది. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఒక్క క్లాసు కూడా తీసుకోలేదు. ద్వితీయ సంవత్సరంలో మొక్కుబడిగా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాలలు ప్రారంభించి 3 నెలలు దాటినా ఒక్క ప్రాక్టికల్ తరగతి నిర్వహించిన పరిస్థితి లేదు. ప్రాక్టికల్స్‌కు ల్యాబ్‌లు, రసాయన పదార్థాలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటి జోళికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు .. ప్రాక్టికల్స్‌ను పర్యవేక్షించాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో పరికరాలు, రసాయనాలు లేవు. ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 ఇంటర్ బోర్డు అధికారులకు అప్పజెప్పి మార్కులు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు ఇంటర్ బోర్టు అధికారులు ప్రాక్టికల్స్ నిర్వహణలో నోరు మెదపడం లేదని తెలిసింది. ఇప్పటికైనా ఇంటర్ ప్రాక్టికల్స్‌పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తల్లి,దండ్రులు కోరుతున్నారు. కళాశాలలను తనిఖీ చేస్తున్నాం. కళాశాలల్లో ప్రయోగశాలల నిర్వహణపై ఇప్పటికే కొన్ని కళాశాలలను తనిఖీ చేశాం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. ప్రధానంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తప్పకుండా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఈ తరగతులు నిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకుంటాం. ప్రాక్టికల్స్ నిర్వహించని కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
పట్టని ప్రయోగం
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య కీలకం. చదువుతోపాటు ప్రయోగాలు చేయాల్సి ఉంది. లేకపోతే ఆ ప్రభావం మార్కుల మీదు పడుతుంది.ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ఎంపీసీ వారికి రెండు, బైపీసీ వారికి 4 సబ్జెక్టులకు మార్కులు ఉంటాయి.ప్రయో పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతున్నా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అంతంగా స్పందించడం లేదు. చివరి దశలో నామమాత్రంగా ప్రయోగపరీక్షలు చేయిస్తూ పరీక్షల సమయంలో పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో కూడా అంతంత మాత్రంగానే చేయిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో ల్యాబ్‌లకు సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజంపేట ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్‌కు గది లేక పరికరాలను బీరువాలో ఉంచి ప్రాక్టికల్స్ సమయంలో బయటికి తీయాల్సిన పరస్థితి నెలకొంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్న ప్రయోగ పరీక్షల దృష్ట్యా ప్రత్యేక కథనం.. కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 174 కళాశాలల్లో 45 వేలమంది విద్యార్థులు ఉన్నారు.వీరిలో 13,251 మంది ఎంపీసీ, బైపీసీ చదువుతున్నారు. జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ రవి తెలిపారు. నాలుగు విడతల్లో పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. 1 నుంచి 5 వరకు మొదటి విడత, 6 నుంచి 10 వరకు రెండో విడత, 11 నుంచి 15వరకు మూడో విడత, 16 నుంచి 20 వరకు నాలుగో విడత పరీక్షలు జరగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సారీ జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బందిని కూడా ఏరోజుకారోజు మార్చి అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నారు. ప్రశ్నపత్రాలు అన్లైన్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు నూతన విధానానికి తెరలేపింది. గతంలో పోస్టల్ ద్వారా పరీక్ష పత్రాలు ఆయా కేంద్రాలకు పంపించేవారు. దీంతో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నట్లు విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షలకు 30 నిమిషాల ముందు సంబంధిత కేంద్రంలో పశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో చాలా కళాశాలల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట మండలంలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో ల్యాబ్ సౌకర్యం లేదు. పరిరకాలను బీరువాలో ఉంచుకుని ల్యాబ్ ఉన్న రోజు బయటకు తీసి టేబుల్‌పైన పెట్టుకుని ప్రయోగాలు చేయించి తిరిగి బీరువాలో భద్రపరచుకునే పరిస్థితి ఉంది. మైదుకూరు ఉర్దూ జూనియర్ కళాశాలకు సొంతభవనాలు లేవు.స్థానిక కొత్తకొట్టాలులో ఉన్న ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 20 మంది ఉన్నారు.ఇక్కడ ల్యాబ్ సౌకర్యం మాత్రం లేదు.అధ్యాపకులు సొంత డబ్బులతో పరికరాలను కొని అరకొరగా ప్రయోగాలను చేయిస్తున్నారు. జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ల్యాబ్‌రూమ్ శిథిలావస్థకు చేరుకుంది. గది పైకప్పు పెచ్చులూడింది.కడప బాలుర, బాలికల జూనియర్ కళాశాల, ఓబులవారిపల్లె, రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పొద్దుటూరులోని పలు కళాశాలల్లో ల్యాబ్స్, పరికరాలు బాగానే ఉన్నాయి. రాయచోటి, నందలూరు, మైలవరం, పెండ్లిమర్రి, పుల్లంపేట, మైదుకూరులలో పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిసింది. భయం భయంతో మా కళాశాలలో ల్యాబ్ సౌకర్యం లేదు. దీంతో పరికరాలను బీరువాలో ఉంచుతాం. ల్యాబ్ క్లాస్ ఉన్నప్పడు వాటిని బయటకు తీసి చిన్న టేబుల్‌పైన పెట్టుకుని భయం భయంగా ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల స్పందించి వసతులన కల్పనకు చర్యలు తీసుకోవాలి. – షేక్ తాసిఫ్,ఉర్దూ జూనియర్ కళాశాల, రాజంపేట -
12నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
జిల్లాలో 161 కేంద్రాలు హాజరుకానున్న 25వేల 39మంది విద్యార్థులు విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్స రం సైన్స్ గ్రూపుల విద్యార్థులకు ఈనెల 12నుంచి మార్చి 3వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 16,546 మంది ఎంపీసీ, 8,493మంది బీపీసీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 161 పరీక్ష కేంద్రాలు ఏ ర్పాటుచేశారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో నా లుగు దశల్లో బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాబ్ పరికరాలు అందుబాటులో ఉన్న కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ కోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని ఇంటర్ విద్య ఆర్ఐఓ మల్హల్రావు తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా వ్యవహరించనుండగా, ఎగ్జామినర్ల నియామ కం పూర్తయిందని పేర్కొన్నారు. ఇంటర్ విద్య ఉన్నతాధికారులతో పాటు జిల్లాలోని హైపవర్ కమిటీ ప్రాక్టికల్స్ నిర్వహణ తీరును పరిశీలిస్తుందని, త్వరలోనే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేస్తామని ఆర్ఐఓ వివరించారు. ఒకేషనల్ విద్యార్థులకు.. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో కొనసాగిస్తున్న ఒకేషనల్ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా ఈనెల 12నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,890మంది, ద్వితీయ సంవత్సరం 4,782మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలు రాయనుండగా, కోర్సులు నిర్వహించే కళాశాలల్లోనే సెంటర్లు ఏర్పాటుచేశారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల కోసం తొలిసారిగా ఇంటర్ బోర్డు ప్రాక్టికల్స్ పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించగా, పారామెడికల్ కోర్సులకు మాత్రం ఆయా కళాశాలల్లోనే ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు.