బతిమాలి టీడీపీలోకి తీసుకెళ్లారు | Kothapalli Subbarayudu About Chandrababu | Sakshi
Sakshi News home page

బతిమాలి టీడీపీలోకి తీసుకెళ్లారు

Mar 26 2019 11:19 AM | Updated on Mar 26 2019 11:33 AM

Kothapalli Subbarayudu About Chandrababu - Sakshi

ప్రచార వ్యూహంపై చర్చిస్తున్న వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

సాక్షి, నరసాపురం: తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసం దారుణమైనదని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అనంతరం సోమవారం స్థానిక రుస్తుంబాదలోని ఆయన నివాసం వద్ద తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. తనకు టీడీపీ టికెట్‌ ఇవ్వనందుకు బాధ లేదన్నారు. కానీ చివరి వరకూ చెప్పకుండా, తనకు వేరే పార్టీల్లో అవకాశాలు లేకుండా చేయడమే బాధ కలిగిస్తుందన్నారు. తనను బతిమాలి టీడీపీలోకి తీసుకెళ్లారన్నారు. తన రాజకీయ జీవితంలో దాదాపుగా మొత్తం సమయాన్ని టీడీపీకి ముఖ్యంగానారా చంద్రబాబునాయుడుకు కేటాయించానని చెప్పారు. ఎన్ని పదవులు చేసినా అవినీతి మచ్చ లేకుండా జీవించానని అన్నారు. జిల్లాలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయడమే తన లక్ష్యమని కొత్తపల్లి చెప్పారు. 


ముదునూరిని గెలిపిద్దాం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే వెనక్కితీసుకోరని కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. చంద్రబాబునాయుడు మాదిరిగా మోసాలు ఆయనకు తెలియవన్నారు. పాలకొల్లు పర్యటనకు రానున్న జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్వత్వంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. నరసాపురంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముదునూరి ప్రసాదరాజు విజయానికి తన కోసం కంటే రెట్టింపుగా కష్టపడాలని తన వర్గీయులకు సూచించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కొత్తపల్లి అభిమానులు హాజరయ్యారు. సోమవారం ఉదయం ముదునూరి ప్రసాదరాజు కొత్తపల్లిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రచార వ్యూహాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడీ రాజు, రాష్ట్ర నేత కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ బులిమస్తాన్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement