రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు దగ్ధం

KMBT Private Travels Two Buses Were Destroyed By Fire - Sakshi

పార్కు చేసి ఉండగా ఆటోనగర్‌లో ఘటన

మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్‌ సిబ్బంది

విచారణ అవసరం అన్న అగ్నిమాపక శాఖ అధికారి

షార్ట్‌ సర్క్యూట్‌ అని సీఐకి తెలిపిన బస్సు యజమాని

విచారణలో వెల్లడికానున్న వాస్తవాలు

సాక్షి, ఒంగోలు: స్థానిక త్రోవగుంట ఆటోనగర్లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 4 గంటల మధ్యలో రెండు కె.యం.బి.టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. కానీ అప్పటికే రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో ఆటోనగర్‌లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పార్కు చేసిన వాహనాలు దగ్ధం కావడంపై ఏం జరిగి ఉంటుందా అంటూ చర్చించుకోవడం ప్రారంభించారు. మీడియాలో వస్తున్న కథనాలతో తాలూకా సీఐ యం.లక్ష్మణ్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలిబూడిదైన రెండు బస్సులను పరిశీలించారు.


త్రోవగుంట ఆటోనగర్‌లో మంటల్లో దగ్ధం అవుతున్న ప్రైవేట్ర్‌ టావెల్స్‌ బస్‌లు

బస్సుల యజమాని కళాధర్‌ను ప్రశ్నించారు. రెండు బస్సులకు మంటలు ఎలా అంటుకున్నాయి, మీకు ఎప్పుడు తెలిసింది తదితర ప్రశ్నలు వేశారు. తనకు ఉదయం 3.35 గంటల సమయంలో ఫోన్‌ వచ్చిందని, అయితే అప్పటికే కంట్రోల్‌ రూం నుంచి సమాచారం అందడంతో అగ్నిమాపక శకటం కూడా ఘటనాస్థలానికి బయల్దేరినట్లు తెలిసిందన్నారు. దీంతో తాను హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నానన్నారు. కాలిపోయిన బస్సు ధర రూ. 1.50 కోట్లు ఉంటుందని, రెండు బస్సులకు బీమా సౌకర్యం కూడా ఉన్నట్లు తెలిపారు.  ప్రమాదానికి కారణం ఏసీ మెషీన్‌ వద్ద ఎలుకలు వైర్‌ను కట్‌ చేయడం ద్వారా షార్ట్‌ సర్క్యూట్‌ అయి మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నామని సీఐ లక్ష్మణ్‌కు తెలిపారు.

వెల్లువెత్తుతున్న అనుమానాలు
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇటు పోలీసులకే కాకుండా మరో వైపు అగ్నిమాపక శాఖ అధికారులకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారిని వివరణ కోరగా తొలుత ఏదైనా కేర్‌లెస్‌ స్మోకింగ్‌ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ప్రాంతాన్ని పరిశీలించామని, అయితే అటువంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు పడి ఉండడాన్ని గుర్తించామని, మద్యం సేవించడం ఆ ప్రాంతంలో నిత్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. రెండు బస్సులు పార్కు చేసి ఉన్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరుగుతుందని తాము భావించలేకపోతున్నామని ఈ నేపథ్యంలో పోలీసు విచారణ తప్పనిసరి అని భావించి ఘటనపై పోలీసులను విచారణ చేపట్టాలని కోరుతూ పోలీసుశాఖకు సమాచారం పంపనున్నట్లు ఒంగోలు ఫైర్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

రహస్య విచారణ చేపట్టిన పోలీసులు
ఇదిలా ఉంటే బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా తదుపరి విచారణను వేగవంతం చేయాలని పోలీసులు దృష్టి సారించారు. అయితే తమకు ఫిర్యాదు రానప్పటికీ ఘటన తమ పరిధిలోది కావడంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆయన రహస్య విచారణను వేగవంతం చేశారు. తొలుత బస్సు దగ్ధం అవుతున్న దృశ్యాన్ని గమనించింది ఎవరు, కంట్రోల్‌ రూంకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా తెలుసుకునే బాధ్యతను సిబ్బందికి అప్పగించారు. అయితే వెల్లువెత్తుతున్న అనుమానాల నేపథ్యంలో సంబంధిత ఏరియాలో సెల్‌టవర్ల నుంచి వెళ్లిన కాల్స్‌ జాబితాను కూడా పరిశీలించి వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని భావిస్తున్నట్లు సమాచారం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top