సోనియానే మొదటి ముద్దాయి | Kishan Reddy Slams Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియానే మొదటి ముద్దాయి

Mar 5 2014 11:01 PM | Updated on Oct 19 2018 7:57 PM

తెలంగాణలో యువకులు బలిదానం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే మొదటి ముద్దాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్నప్పటికీ ఉద్యమ సందర్భంగా వందలాది మంది యువకులు బలిదానం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే మొదటి ముద్దాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంతంలోని 1100 మంది బలిదానాలతో కాంగ్రెస్ పార్టీ చేతులు రక్తంతో తడిచిపోయాయన్నారు. అలాంటి చేతులను వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు విరిచివేయాల్సిన పరిస్థితి ఉందని పిలుపునిచ్చారు.

నల్గొండ జిల్లా తెలంగాణ జేఏసీ చైర్మన్ గోరి ఆమరేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు సంకినేని వెంకటేశ్వర్లు, టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డి, ఆదిలాబాద్ పట్టణ టీడీపీ నేత పాయల శంకర్ తదితరులు బుధవారం కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చిన తెలంగాణ ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుందన్నది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్, అనేక ఇతర పార్టీలు తమ వల్లే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్నప్పటికీ..మూడు నెలలో కేంద్రంలో అధికారం కోల్పోయే కాంగ్రెస్ పార్టీ వల్లనో, ప్రాంత్రీయ పార్టీల వల్లనో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాబట్టి తెలంగాణ అభివృద్ధి బీజేపీకే సాధ్యపడుతుందని చెప్పారు. చాలా మంది నరేంద్రమోడీ అధికారంలోకి రావాలంటే మాకొచ్చే రెండు మూడు సీట్లుపై ఆధారపడాల్సి వస్తుందని ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రాంతీయ పార్టీల ఆవసరం లేకుండానే మోడీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు.

కేంద్ర మంత్రి జయరాం రమేష్, కమల్ నాథ్, రాష్ట్ర నేతలు డీఎస్ వంటి వారు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ.. అలాంటి మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలేమీ అమాయకులు కాదని చెప్పారు. ఎవరి ద్వారా తెలంగాణ కల సాకారమైందో ప్రజలు అర్థంచేసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ వంటి పార్టీలు కేవలం కుటుంబ పార్టీలంటూ దుయ్యబట్టారు. ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం కాకుండా ఆయా పార్టీలు కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని విమర్శించారు. బీజేపీ ఒక్కటే కార్యకర్తల పార్టీగా చెప్పారు.

టీ కొట్టు యజమాని కొడుకు ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం బీజేపీకి మాత్రమే సాధ్యపడిందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం బీజేపీకి శుభసూచకం లాంటిదని.. ఇదే రోజు నల్గొండ జిల్లా నేతలు పార్టీ చేరి దీనికి నాందిపలికారని అన్నారు. రానున్న మూడు నెలల కాలం పార్టీ కార్యకర్తలు నిద్రపోవడం మినహాయించి గంట సమయం కూడా వృధా చేయకుండా పార్టీ సిద్ధాంతాలను రాష్ట్రంలో ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.
 
గవర్నర్ తీరు సరికాదు
రాష్ట్రపతి పాలన నేపథ్యంలో రెండు మూడు రోజులుగా గవర్నర్ తీసుకుంటున్న చర్యలుప్రజాస్వామ్యం దృష్ట్యా సరైనవి కావని పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సాధారణంగా ఒక సీఎం మారాక మరో సీఎం వస్తే పాత ప్రభుత్వ పాలసీలపై రివ్యూ జరుగుతుంటుందని.. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఆఖరి రోజులలో తీసుకున్న నిర్నయాలను గవర్నర్ సమీక్షిస్తారంటే నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తారని అనుకున్నామని చెప్పారు. తీరా చూస్తే అధికార బదిలీ నిర్ణయాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ రాజకీయ వాదిగా వ్యవహరించారని, మిగిలిన మూడు నెలల కాలంలోనైనా రాజకీయవాదిగా ఉండరని భావిస్తున్నామని చెప్పారు. పార్టీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, చింతా సాంబమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement