కిడ్నాప్ కథ సుఖాంతం | Kidnapped happy ending story | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ కథ సుఖాంతం

Nov 21 2013 2:37 AM | Updated on Aug 21 2018 7:53 PM

నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కిడ్నాప్‌నకు గురైన యువకుడిని పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే రక్షించారు.

 అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కిడ్నాప్‌నకు గురైన యువకుడిని పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే రక్షించారు. కిడ్నాపర్లకు బహిరంగ కౌన్సెలింగ్ ఇచ్చారు. వన్‌టౌన్  పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కదిరికి చెందిన ఆనందరెడ్డి అనే యువకుడు చికిత్స నిమిత్తం తరచూ నగరానికి వచ్చేవాడు. ఈ క్రమంలో బిందెల కాలనీకి చెందిన రాజశేఖర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆనందరెడ్డి వద్ద చాలా డబ్బుందన్న విషయాన్ని రాజశేఖర్ పసిగట్టాడు. ఆనందరెడ్డిని కిడ్నాప్ చేసి సులభంగా డబ్బు సంపాదించాలని సన్నిహితులైన పింజరి బాబు, సురేంద్ర, లక్ష్మన్నతో కలిసి పథకం రచించాడు.
 
 అందులో భాగంగా ఆనందరెడ్డి వ్యక్తిగత పని నిమిత్తం మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కదిరి నుంచి ఆర్టీసీ బస్సు(ఏపీ02ఏఎల్ 1305)లో హైదరాబాద్‌లో బయల్దేరినట్లు ఆంజనేయులు అనే వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్నాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు బస్సు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. అప్పటికే రాజశేఖర్‌తోసహా నలుగురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆనందరెడ్డి ఏ సీట్లో కూర్చున్నారో గుర్తించారు. అనంతరం బస్సు బస్టాండ్ నుంచి బయటకు రాగానే ఆ నలుగురూ కారులో వెంబడించారు. రాజహంస అపార్టుమెంట్ సమీపంలోకి రాగానే బస్సును అటకాయించి ఆనందరెడ్డిని బలవంతంగా లాక్కొచ్చి కారులో తీసుకెళ్లారు. ముఖానికి ముసుగు వేసి అతడిని నగరమంతా కారులోనే తిప్పుతూ రూ.లక్ష ఇస్తే వదిలి పెడతామని, లేకుంటే కడతేరుస్తామని బెదిరించారు. బుధవారం ఉదయం శ్రీకంఠం సర్కిల్‌లో సీఐ గోరంట్ల మాధవ్, ఎస్‌ఐలు జాకీర్ హుస్సేన్, ధరణీ కిశోర్‌లు వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులోంచి ఆనందరెడ్డి ‘రక్షించండి’ అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో వారు ఆ కారులోంచి అతడిని రక్షించి.. నిందితులను అరెస్ట్ చేశారు.
 
 నడిరోడ్డులో కౌన్సెలింగ్..
 కిడ్నాపర్లు రాజశేఖర, పింజరి బాబు, సురేంద్ర, లక్ష్మన్నకు పోలీసులు బుధవారం రాత్రి బహిరంగ కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరాలకు పాల్పడబోమని.. ఎలాంటి సమస్యనైనా న్యాయస్థానం, పోలీసుల సమక్షంలోనే పరిష్కరించుకుంటామని చెప్పిస్తూ వారిచేత దండాలు పెట్టించారు. అనంతరం సీఐ గోరట్ల మాధవ్ మాట్లాడుతూ పెరుగుతున్న నేరాలను నియంత్రించే క్రమంలో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నేరగాళ్ల పీచమణచే పనిలో పడ్డామని తెలిపారు. సమస్య ఎంత కఠినమైనదైనా దానికి ప్రాణాలు తీయడమో, ఒక మనిషిని బెదిరించడమో సరైన మార్గం కాదన్నారు. కౌన్సెలింగ్ ఆపేది లేదని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement