కుంటిసాకులతో కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
కాకినాడ : కుంటిసాకులతో కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెక్ పెట్టింది. ఎన్ని అవరోధాలున్నా సెప్టెంబర్ 20లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి కొత్తపాలకవర్గ పర్యవేక్షణలో పరిపాలన ప్రారంభం కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రానున్న మూడు, నాలుగు నెలల్లో కచ్చితంగా కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
కాకినాడ కార్పొరేషన్ తొలి పాలకవర్గ పదవీకాలం 2010 సెప్టెంబర్‌తో ముగిసింది. అయితే వెంటనే ఎన్నికలు జరపడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తరువాత అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం తాత్సారం చేయడంతో దాదాపు ఐదున్నరేళ్లుగా పాలకవర్గం లేకుండా పోయింది. రాజకీయంగా పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో కుంటిసాకులు చెబుతూ ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన చిట్నీడి నారాయణమూర్తి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో దీనిపై కదలిక వచ్చింది.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోరగా నాలుగు నెలలు వరకు కార్పొరేషన్ ఎన్నికలు జరపలేమని చేతులు ఎత్తేసింది. దీనిపై గురువారం తుది తీర్పును వెలువరిస్తూ మే 16వ తేదీ కల్లా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని, సెప్టెంబర్ 20వ తేదీలోపుగా కొత్తపాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో జూన్ నుంచి సెప్టెంబర్‌లోపు కచ్చితంగా ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తోంది.
విలీనంపై కొరవడిన స్పష్టత
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి విలీన పంచాయతీలపై అధికార వర్గాల్లో స్పష్టత కనిపించడంలేదు. గతంలో ఉన్న 50 వార్డులతోపాటు తూరంగి, ఎస్.అచ్యుతాపురం, స్వామినగర్, టీచర్స్‌కాలనీలను కలిపి డివిజన్ల పునర్విభజన చేశారు. ఆ తరువాత తూరంగి విలీనంపై కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో ఇప్పుడు తాజాగా తూరంగిని తొలగించి పునర్విభజన చేసి ఎన్నికలకు వెళ్లాలా! లేక గతంలో చేసిన విధంగానే ప్రక్రియ కొనసాగించాలా? అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
మరో వైపు ఇటీవల రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల వంటి పంచాయతీలను కూడా కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, ఆ వెంటనే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వీటి విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికల విషయంలో విలీన పంచాయతీలతో ముందుకు వెళుతుందా? పాత డివిజన్లతోనే నిర్వహిస్తుందా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తంమీద కాకినాడ నగరపాలక సంస్థలో కార్పొరేషన్ ఎన్నికల వేడి రాజుకుంది.