Kakinada Municipal Corporation elections
-
కాకినాడను కలుషితం చేస్తున్న చంద్రబాబు
-ఏపీ సీఎంపై వైఎస్సార్సీపీ నేత భూమన ఫైర్ - నంద్యాల తరహాలోనే నాటకాలాడుతున్నారు - కాపులను రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారు సాక్షి, కాకినాడ: మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒరగబెట్టింది ఏంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారావారి పాలన నీరో పాలన కంటే అధ్వానంగా ఉందన్నారు. 600 అబద్ధాల హామీలతో రాష్ట్ర ప్రజలను వంచించిన చంద్రబాబు, ఇప్పుడు అబద్ధపు హామీతో కాకినాడను కలుషితం చేస్తున్నారని చెప్పారు. నంద్యాల తరహాలోనే కాకినాడలోనూ బాబు నాటకాలాడుతున్నారని భూమన తెలిపారు. మళ్లీ మళ్లీ మోసపోయేందుకు కాకినాడ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ల హామీతో మోసం చేసిన చంద్రబాబు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. తుని ఘటనకు కూడా చంద్రబాబే కారణమని భూమన పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఈ మూడున్నరేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అవినీతి చేశారన్నారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా? అని చంద్రబాబును సూటింగా ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో ఇప్పుడు ప్రజలను కలుషితం చేసేందకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారని భూమన తెలిపారు. అ అంటే అధికారం.. ఆ అంటే ఆదాయం అన్నట్లుగా బాబు తీరుందని, తమ అధినేత వైఎస్ జగన్ ను విమర్శించే హక్కు చంద్రబాబుకు ఎంత మాత్రం భూమన చెప్పారు. రేపు కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ బహిరంగ సభ ఉందని ప్రకటించిన భూమన, భారీగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మరికాసేపట్లో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మానిఫెస్టో పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయనుంది. -
కాకినాడ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వార్డుల పునర్ విభజన, రిజర్వేషన్ల ఖరారును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిపిందే. ప్రస్తుతం 48 వార్డులకే ఎన్నికలు జరుపుతున్నారని, 50 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నాటి నుంచి హైకోర్టులో ఈ పిటీషన్ విచారణ ఏరోజుకారోజు వాయిదాలు పడుతూ వాదనలు జరిగాయి. దీనిపై ఎట్టకేలకు హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. కాగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేస్తేనే తమకు మంచిదన్న ఆలోచనతో టీడీపీ శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొని ఎన్నికల్లో గెలవడమంటే కష్టమనే అభిప్రాయంతో ఎన్నికలను ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి వాయిదా వేయించేందుకు చూసినా, న్యాయస్థానం మాత్రం పాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. -
‘కాకినాడ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం’
కాకినాడ: కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం పాటించామన్నారు. పార్టీ అభిప్రాయాలను స్థానిక నేతలు, కార్యకర్తలు స్వాగతించారన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం విస్తృతస్థాయిలో అభిప్రాయాలు సేకరించామని ధర్మాన తెలిపారు. చంద్రబాబు మూడున్నరేళ్ల దుర్మార్గ పాలనపై తీర్పిచ్చే సమయం ఆసన్నమైందన్నారు. కాకినాడ ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రజలు, ప్రతిపక్షాలు, అధికారులకు తెలియకుండా టీడీపీ సర్కార్ రహస్యంగా వందలాది జీవోలు జారీ చేయడం దారుణమన్నారు. అంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.. అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులకు బీ ఫారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కురసాల కన్నబాబు, చెలమలశెట్టి సునీల్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముత్తా శశిధర్, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది..
కాకినాడ: నగర కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. కార్పొరేషన్‌లోని 48 వార్డుల్లో జరగనున్న ఎన్నికలలో టీడీపీ 39, బీజేపీ 9 చోట్ల నుంచి పోటీ చేయనున్నాయి. కాగా కనీసం 20 టిక్కెట్లు కావాలని బీజేపీ పట్టుబట్టినప్పటికీ మూడు సీట్లకు మించి ఇవ్వలేమంటూ టీడీపీ తేల్చి చెప్పింది. దీంతో మంత్రులు రంగంలోకి దిగి ఇరుపార్టీల మధ్య నెలకొన్న వివాదానికి తెర దించారు. ఎట్టకేలకు బీజేపీకి తొమ్మిది సీట్లు కేటాయించింది. అలాగే ఈ నెల 29న జరిగే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఏడేళ్ల తర్వాత నగర కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో గతంలో పోటీ చేసిన ప్రాంతాలు తారుమారు కావడం, రిజర్వేషన్లు మారడం, అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు కొంత తలనొప్పిగా మారింది. -
ఎన్నికల ‘కాక’నాడ!
కాకినాడ : కుంటిసాకులతో కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెక్ పెట్టింది. ఎన్ని అవరోధాలున్నా సెప్టెంబర్ 20లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి కొత్తపాలకవర్గ పర్యవేక్షణలో పరిపాలన ప్రారంభం కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రానున్న మూడు, నాలుగు నెలల్లో కచ్చితంగా కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ కార్పొరేషన్ తొలి పాలకవర్గ పదవీకాలం 2010 సెప్టెంబర్‌తో ముగిసింది. అయితే వెంటనే ఎన్నికలు జరపడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తరువాత అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం తాత్సారం చేయడంతో దాదాపు ఐదున్నరేళ్లుగా పాలకవర్గం లేకుండా పోయింది. రాజకీయంగా పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో కుంటిసాకులు చెబుతూ ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన చిట్నీడి నారాయణమూర్తి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో దీనిపై కదలిక వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోరగా నాలుగు నెలలు వరకు కార్పొరేషన్ ఎన్నికలు జరపలేమని చేతులు ఎత్తేసింది. దీనిపై గురువారం తుది తీర్పును వెలువరిస్తూ మే 16వ తేదీ కల్లా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని, సెప్టెంబర్ 20వ తేదీలోపుగా కొత్తపాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో జూన్ నుంచి సెప్టెంబర్‌లోపు కచ్చితంగా ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తోంది. విలీనంపై కొరవడిన స్పష్టత కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి విలీన పంచాయతీలపై అధికార వర్గాల్లో స్పష్టత కనిపించడంలేదు. గతంలో ఉన్న 50 వార్డులతోపాటు తూరంగి, ఎస్.అచ్యుతాపురం, స్వామినగర్, టీచర్స్కాలనీలను కలిపి డివిజన్ల పునర్విభజన చేశారు. ఆ తరువాత తూరంగి విలీనంపై కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో ఇప్పుడు తాజాగా తూరంగిని తొలగించి పునర్విభజన చేసి ఎన్నికలకు వెళ్లాలా! లేక గతంలో చేసిన విధంగానే ప్రక్రియ కొనసాగించాలా? అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరో వైపు ఇటీవల రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల వంటి పంచాయతీలను కూడా కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, ఆ వెంటనే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వీటి విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికల విషయంలో విలీన పంచాయతీలతో ముందుకు వెళుతుందా? పాత డివిజన్లతోనే నిర్వహిస్తుందా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తంమీద కాకినాడ నగరపాలక సంస్థలో కార్పొరేషన్ ఎన్నికల వేడి రాజుకుంది.