నారావారి మూడేళ్ల పాలన నీరో పాలన కంటే దారుణంగా ఉందని...
-ఏపీ సీఎంపై వైఎస్సార్సీపీ నేత భూమన ఫైర్
- నంద్యాల తరహాలోనే నాటకాలాడుతున్నారు
- కాపులను రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారు
సాక్షి, కాకినాడ: మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒరగబెట్టింది ఏంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారావారి పాలన నీరో పాలన కంటే అధ్వానంగా ఉందన్నారు.
600 అబద్ధాల హామీలతో రాష్ట్ర ప్రజలను వంచించిన చంద్రబాబు, ఇప్పుడు అబద్ధపు హామీతో కాకినాడను కలుషితం చేస్తున్నారని చెప్పారు. నంద్యాల తరహాలోనే కాకినాడలోనూ బాబు నాటకాలాడుతున్నారని భూమన తెలిపారు. మళ్లీ మళ్లీ మోసపోయేందుకు కాకినాడ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ల హామీతో మోసం చేసిన చంద్రబాబు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. తుని ఘటనకు కూడా చంద్రబాబే కారణమని భూమన పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఈ మూడున్నరేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అవినీతి చేశారన్నారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా? అని చంద్రబాబును సూటింగా ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో ఇప్పుడు ప్రజలను కలుషితం చేసేందకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారని భూమన తెలిపారు. అ అంటే అధికారం.. ఆ అంటే ఆదాయం అన్నట్లుగా బాబు తీరుందని, తమ అధినేత వైఎస్ జగన్ ను విమర్శించే హక్కు చంద్రబాబుకు ఎంత మాత్రం భూమన చెప్పారు. రేపు కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ బహిరంగ సభ ఉందని ప్రకటించిన భూమన, భారీగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మరికాసేపట్లో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మానిఫెస్టో పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయనుంది.