
కాకినాడ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
హైదరాబాద్ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వార్డుల పునర్ విభజన, రిజర్వేషన్ల ఖరారును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిపిందే. ప్రస్తుతం 48 వార్డులకే ఎన్నికలు జరుపుతున్నారని, 50 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నాటి నుంచి హైకోర్టులో ఈ పిటీషన్ విచారణ ఏరోజుకారోజు వాయిదాలు పడుతూ వాదనలు జరిగాయి. దీనిపై ఎట్టకేలకు హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. కాగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేస్తేనే తమకు మంచిదన్న ఆలోచనతో టీడీపీ శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొని ఎన్నికల్లో గెలవడమంటే కష్టమనే అభిప్రాయంతో ఎన్నికలను ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి వాయిదా వేయించేందుకు చూసినా, న్యాయస్థానం మాత్రం పాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.