దైవజనులు దీవిస్తే లక్ష్యం సాధించగలం

Kakani Govardhan Reddy Slams TDP - Sakshi

పదవులు ముఖ్యం కాదు జగన్‌ సీఎం కావాలి

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు పొదలకూరు: దైవజనులు దీవిస్తే ఏర్పరచుకున్న లక్ష్యం సాధించగలమని, ఉన్న అడ్డంకులు తొలగుతాయని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు అంబేడ్కర్‌ భవన్‌లో మంగళవారం మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ దైవసేవకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలు సమానమేనన్నారు. తాను ప్రచార రథం తయారు చేయించి సాయిబాబా మందిరం, మసీదు, పాస్టర్ల వద్ద పూజలు చేయించినట్టు తెలిపారు. జీసస్‌ మానవాళికి శాంతి మార్గాన్ని చూపారన్నారు. వక్రమార్గంలో నడస్తున్న వారికి కౌన్సెలింగ్‌ చేయడమంటే జీసస్‌ సందేశాన్ని అందజేయడమేన్నారు. క్రైస్తవులు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లేకుండా జీవిస్తున్నది కొంతవరకు నిజమేనన్నారు.

దేశంలోని కొన్ని శక్తులు ఉగ్రవాదులుగా తయారై శాంతికి విఘాతం కలిగిస్తున్నట్టు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల అణచివేతకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు తెలిపారు. తాను మంత్రినై, పదువుల్లోకి చేరుకునే ముందు జగన్‌ సీఎం కావాలని దైవజనులు ప్రార్థనలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జగన్‌ సీఎం అయితే చీమకు కూడా హాని తలపెట్టరన్నారు. జగన్‌ తల్లి విజయమ్మ మనోధైర్యం, మానశిక ప్రశాంతత కోసం బైబిల్‌ చేతపట్టుకుంటే చంద్రబాబు దాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడం దురదృష్టకరమన్నారు. తనపై ఓడిపోయిన నాయకుడ్ని మంత్రిని చేసి సర్వేపల్లి నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం వద్దకు వెళితే టీడీపీ కండువా వేసుకోవాలని కోరారని, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం తనది కాదని వెల్లడించానన్నారు.

క్రైవస్తవుల సమస్యల పరిష్కారం..
క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగానే పొదలకూరులో క్రైవస్తవుల భవనం నిర్మిస్తానన్నారు. సమాధుల తోట అభివృద్ధి చేయడంతో పాటు, చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చర్చిలకు లైట్లు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. క్రైస్తవుల మనోభావాలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించడంతో పాటు, పాస్టర్లకు ఇంటినివేశనా స్థలాలు, ఇంటి నిర్మాణానికి పాటుపడతానన్నారు. అనంతరం మండలంలోని పాస్టర్లు దైవజనురాలు లిలితాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయం కోసం ప్రార్థన చేశారు. కార్యక్రమంలో పాస్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షురాలు లలితాప్రసాద్, ఉపాధ్యక్షుడు జాన్‌పాల్, ట్రెజరర్‌ అబ్రహాం, కార్యక్రమ నిర్వాహకుడు స్వరాజ్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి నోటి శ్రీలత, పొదలకూరు, విరువూరు మాజీ సర్పంచులు తెనాలి నిర్మలమ్మ, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వూకోటి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సులోచన, అంజాద్, నాయకులు ఎం.వెంకట్రామిరెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, జి.రమణారెడ్డి పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top