చిరకాల కోరిక తీరకుండానే..

Kadapa Woman Died In Amaranth Yatra  - Sakshi

అమరనాథ్‌ యాత్రలో విషాదం

గుండె పోటుతో ప్రొద్దుటూరు మహిళ మృతి

ప్రత్యేక విమానంలో మృతదేహం హైదరాబాద్‌కు  తరలింపు

సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : ప్రొద్దుటూరులోని బాలాజీనగర్‌–1కు చెందిన పెండ్లిమర్రి భాగ్యమ్మ (51) అమరనాథ్‌ యాత్రలో గుండె పోటుతో మృతి చెందింది. జూన్‌  26న ఆమె భర్త శంకరయ్యతో కలిసి అమరనాథ్‌ యాత్రకు బయలుదేరి వెళ్లింది. 12 మంది బంధువులు, కర్నూల్‌ నుంచి సుమారు 100 మంది భక్తులతో కడప నుంచి నిజాముద్ధీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్లారు. 27న ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని వైష్ణవి ఆలయం, ద్వారక, స్వర్ణదేవాలయం, వాఘా సరిహద్దు, జమ్ము కాశ్మీర్‌లోని పలు ప్రదేశాలను సందర్శించారు. అమరనాథ్‌ కొండపైకి వెళ్లేందుకు ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కశ్మీర్‌లో ఉన్న బర్తాల్‌ బేస్‌ క్యాంపునకు చేరుకొని రాత్రి ఉండటానికి బాడుగ రూములు తీసుకున్నారు.

ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి గురువారం ఉదయం అమరనాథుని దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం డోలీలకు డబ్బు కూడా చెల్లించారు. అయితే కొద్ది సేపటి తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో భాగ్యమ్మకు గుండె పోటు రావడంతో కుప్ప కూలిపోయింది. భర్తతో పాటు యాత్రికులు ఆమె వద్దకు చేరుకునే లోపు తుదిశ్వాస విడిచింది. భార్య అకాల మరణాన్ని చూసి భర్త శంకరయ్య తల్లడిల్లిపోయారు. తమకు బుధవారం సాయంత్రం 4.40 గంటల​​‍కు సమాచారం అందిందని  కుటుంబ సభ్యులు తెలిపారు. కశ్మీర్‌లో ఫోన్‌లు పని చేయకపోవడంతో వీరికి ఆలస్యంగా తెలిసింది.

ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు మృతదేహం
బర్తాల్‌ బేస్‌ క్యాంపు సమీపంలోని సోనామార్గ్‌ ఆస్పత్రిలో గురువారం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొని వచ్చారు. శుక్రవారం ఉదయం వారి స్వస్థలమైన ప్రొద్దుటూరుకు భాగ్యమ్మ మృతదేహాన్ని తీసుకొని వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.     

పూర్తి ఆరోగ్యంతో ఉండేది
భాగ్యమ్మ పూర్తి ఆరోగ్యంతో ఉండేదని,  ఏ రోజు ఆస్పత్రికి వెళ్లలేదని కుమార్తె నాగవేణి తెలిపింది. తల్లి మరణ వార్త విని ఆమె బోరున విలపించసాగింది. శంకరయ్య, భాగ్యమ్మ దంపతులకు మంజుల, నాగవేణి అనే కుమార్తెలు, శరత్‌ అనే కుమారుడు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. శంకరయ్య జమ్మలమడుగు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది అతను జమ్మలమడుగు డిపోకు బదిలీ అయ్యారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ పొందనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా బుధవారం ఉదయం 7.30 సమయంలో తల్లి భాగ్యమ్మ తమతో ఫోన్‌లో మాట్లాడిందని కుమార్తె నాగవేణి చెబుతూ విలపించసాగింది. కశ్మీర్‌లో ఉన్నామని, రేపు (గురువారం) ఉదయం అమరనాథ్‌ కొండపైకి వెళ్తామని తల్లి చెప్పినట్లు తెలిపింది. ఆమె ఫోన్‌ పని చేయకపోవడంతో ట్రావెల్స్‌ ప్రతినిధి ఫోన్‌తో మాట్లాడిందన్నారు. ఏదైనా అవసరం ఉంటే ఈ నంబర్‌కే ఫోన్‌ చేయాలని తల్లి చెప్పిందని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించింది. తల్లి మరణ వార్త విని కడపలో ఉంటున్న ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు శ్రీధర్, అర్జున్‌ ప్రొద్దుటూరుకు వచ్చారు. తల్లి మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చేందుకు కుమారుడు శరత్‌ హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top