ఇక ‘లైన్‌’గా ఉద్యోగాలు! | Junior Lineman Recruitment In Srikakulam | Sakshi
Sakshi News home page

ఇక ‘లైన్‌’గా ఉద్యోగాలు!

Aug 7 2019 8:27 AM | Updated on Aug 7 2019 8:31 AM

Junior Lineman Recruitment In Srikakulam - Sakshi

విద్యుత్‌ పనుల్లో నిమగ్నమైన సిబ్బంది

సాక్షి, అరసవల్లి: రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్లను నియమించిన ప్రభుత్వం, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మరిన్ని పోస్టులు అదనంగా చేరనున్నాయి. ఇంతవరకు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత విద్యార్హతలతో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తాజాగా పదో తరగతి, ఎలక్ట్రికల్‌ ఐటీఐ వంటి విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలోని ఖాళీలుగా ఉన్న 679 లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. దీంతో జగన్‌ ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులకు వరంలా మారింది.

మొత్తం 679 పోస్టుల భర్తీ..
జిల్లాలో విద్యుత్‌ సంస్థలో ఇంత భారీగా లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. దశాబ్దాల కాలం నుంచి ఈ రిక్రూట్‌మెంట్‌ కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు ఇన్నాళ్లకు కల నెరవేరనుంది. వయో పరిమితిని సడలించడంతో చాలా మందికి అర్హత కలగనుంది. గ్రామ/ వార్డు సచివాలయాలు అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సచివాలయాల్లోనే ఎనర్జీ అసిస్టెంట్‌ (జూనియర్‌ లైన్‌మెన్‌–గ్రేడ్‌–3) పేరిట ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో 835 గ్రామ సచివాలయాల్లో 592 లైన్‌మెన్లు, 94 వార్డు సచివాలయాల్లో 87 లైన్‌మెన్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎనర్జీ అసిస్టెంట్లను గ్రామాల్లో 2177, వార్డుల్లో 682 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆఖరు తేదీ 17..
లైన్‌మెన్ల పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది. ఇప్పటికే దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ఈ నెల 17 అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులను ఆన్‌లైన్లో అనుమతిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు జరగనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు కచ్చితంగా విద్యుత్‌ స్తంభం ఎక్కడం తెలుసుండాలి. మీటర్‌ రీడింగ్‌ నిర్వహణపై అవగాహన ఉండాలి. పూర్తి వివరాలకు ఏపీఈపీడీసీఎల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు చెబుతున్నారు.

పోస్టులకు అర్హతలు ఇవే...
జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల కోసం ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్‌మెన్‌ ట్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వారు/ ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయన్సెస్‌– రివైండింగ్‌/ఎలక్ట్రికల్‌ వైరింగ్‌– కాంట్రాక్టింగ్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతరుల విభాగంలో 35 ఏళ్లు వయస్సున్న పురుషులు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. 20 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో (నాన్‌ లోకల్‌), మిగిలిన 80 శాతం స్థానిక కోటాలో (లోకల్‌) భర్తీ చేయనున్నారు.

ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. నిబంధనల ప్రకారం ఇదే జిల్లాలో వరుసగా నాలుగు విద్యాసంవత్సరాలు ఒకేచోట చదివితే లోకల్‌ క్యాండిడేట్‌గా గుర్తించనున్నారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తింపజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement