‘తెలుగు మాట్లాడే వాళ్లంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని ఏర్పడిన ఆంధ్రరాష్ట్రాన్ని విభజించే హక్కు ఎక్కడో ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి ఏమాత్రం లేదు.
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: ‘తెలుగు మాట్లాడే వాళ్లంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని ఏర్పడిన ఆంధ్రరాష్ట్రాన్ని విభజించే హక్కు ఎక్కడో ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి ఏమాత్రం లేదు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మొట్ట మొదట లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రజలను నమ్మించడానికి పడరాని పాట్లు పడుతూ దొంగబాబులా తయారయ్యారు...’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ.గాయత్రీదేవీ ఆరోపించారు.
సమైక్యాంధ్రకు మద్దుతుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ జైలులో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా గాయత్రీదేవీ ఆధ్వర్యంలో చిత్తూరులో భారీ మహిళా ర్యాలీ జరిగింది. ప్రభుత్వాస్పత్రి వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మహిళలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ప్లకార్డులను చేతబట్టి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అనంతరం గాయత్రీదేవీ మాట్లాడుతూ ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని సోనియాగాంధీ అగ్నిగుండంగా మార్చేసిందన్నారు.
రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఆయన ప్రభంజనాన్ని తట్టుకోలేకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఆత్మగౌరవ యాత్రకు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట మహిళలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.