పరిపాలన  వికేంద్రీకరణతో పారిశ్రామిక పరుగులు

Industrial growth with governance decentralization - Sakshi

మూడు రాజధానులకు పారిశ్రామిక, వ్యాపార సంఘాల సంపూర్ణ మద్దతు 

మూడు ప్రాంతాలు, 13 జిల్లాలకు అభివృద్ధి విస్తరించాలి

5 ప్రాంతీయ పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలి

సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ ద్వారా పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుందని పారిశ్రామిక, వ్యాపార సంఘాలు అభిప్రాయపడ్డాయి. ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో వృద్ధి పరుగులు తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధినంతా హైదరాబాద్‌కే పరిమితం చేయడం వల్ల ఏపీలో 13 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని గుర్తు చేశాయి. విభజన గాయాలు నేర్పిన పాఠాలతో అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. శనివారం విజయవాడలో ఫెడరేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎంఈ) నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వ్యాపార, వాణిజ్య సంఘాలు మూడు రాజధానుల ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. 

వ్యవసాయ హబ్‌గా అమరావతి
రాష్ట్రంలో 5 ప్రాంతీయ పారిశ్రామిక క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తిరుపతి క్లస్టర్‌ (నెల్లూరు, చిత్తూరు), కడప క్లస్టర్‌ (కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప), అమరావతి (గుంటూరు, కృష్ణా), రాజమండ్రి (తూర్పు, పశ్చిమగోదావరి), విశాఖ (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. రైతుల నుంచి సేకరించిన 33,000 ఎకరాల్లో అత్యధికంగా సారవంతమైన భూములు ఉన్నందున అమరావతిని అంతర్జాతీయ వ్యవసాయ హబ్‌గా అభివృద్ధి చేసి రైతులకు లాభాలు చేకూర్చాలని సూచించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయానికి ఎఫ్‌ఎస్‌ఎంఈ ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వివిధ వ్యాపార సంఘాల నేతలు మీడియాతో ఏం మాట్లాడారంటే...

హైదరాబాద్‌ మోడల్‌ అభివృద్ధి వద్దు
గత ఐదేళ్లుగా చేనేత రంగం దారుణంగా దెబ్బతింది. చేనేత కార్మికులకు రూ.24,000 చొప్పున ఆర్థిక సాయం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ఆదుకుంది. పత్తి ఎక్కువగా పండే గుంటూరులో ఒక్కటి కూడా భారీ టెక్స్‌టైల్‌ పరిశ్రమ లేదు. దీంతో పత్తిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌ మోడల్‌ అభివృద్ధి వల్ల మనం ఇప్పటికే నష్టపోయాం. మూడు రాజధానుల ఏర్పాటుకు వస్త్ర వ్యాపారులు మద్దతు ఇస్తున్నారు.    
    – బూచిరెడ్డి మల్లేశ్వర రెడ్డి, అధ్యక్షుడు, ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

దూరం అనే వాదన అర్థరహితం..
మూడు రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా అన్ని సేవలను ప్రజల ముంగిటకే తెచ్చినందున సచివాలయం విశాఖలో ఏర్పాటు చేస్తే దూరమవుతుందన్న వాదనలో అర్థం లేదు. అవసరం లేకున్నా 33,000 ఎకరాలు తీసుకొని చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా  వ్యాపారస్తులు మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నారు.
– ఆత్కూరి ఆంజనేయులు, అధ్యక్షుడు, ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 

మెగా రాజధానితో ఉత్తరాంధ్ర, సీమ వెనుకబాటు
‘రాజధాని ఉన్న చోటే అన్నీ అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలను వదిలేయడం సరికాదు. అమరావతి మెగా రాజధాని నిర్మాణం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.   మూడు రాజధానుల ద్వారా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం’
    – లంకా రఘురామి రెడ్డి, ఏపీ టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

నెలల వ్యవధిలో హామీలన్నీ నెరవేర్చారు
తీవ్ర సంక్షోభంలో ఉన్న పారిశ్రామిక రంగాన్ని 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పలు రాయితీలు కల్పించి ఆదుకున్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు రాయితీలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడ్డాం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 8 నెలల్లోనే అన్ని హామీలను నెరవేర్చడంతో ఆయనపై నమ్మకం మరింత పెరిగింది. మూడు రాజధానులకు గట్టిగా మద్దతు ఇస్తున్నాం.    
– ఏ.కృష్ణ, ఏపీ టీఎంసీ జిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

ఉన్నత స్థాయిలో పాలనా వికేంద్రీకరణ
గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ సేవలన్నీ గ్రామాల్లోనే అందిస్తున్నారు. ఇప్పుడు పై స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నాం’
 – కె.రాము, ఏపీ కాటన్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

నియోజకవర్గ, జిల్లా స్థాయి సచివాలయాలు కావాలి
ఒకే ప్రాంతం, ఒకే రాజధాని విధానం వల్ల మనం మళ్లీ నష్టపోతాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సీఎం జగన్‌ దూరదృష్టి బాగుంది. 13 జిల్లాలను క్యాపిటల్‌గా భావించి అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ఏర్పాటైన గ్రామ సచివాలయాలకు అదనంగా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో సచివాలయాలను నెలకొల్పడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణతో పాటు ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాభివృద్ధికి విపక్షాలు సహకరించాలి.    
– ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ–ఇండియా

ఫార్మా అభివృద్ధి చెందుతుంది
మూడు రాజధానుల ఏర్పాటుతో ఆ ప్రాంత సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించవచ్చు. దీనివల్ల రాష్ట్రంలో ఫార్మా రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నాం.   
 – రంగారావు, ఆలిండియా ఆర్గనైజేషన్‌  ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ సౌత్‌జోన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top