పెరిగిన వరద | Increased flooding of Krishna and Godavari Rivers | Sakshi
Sakshi News home page

పెరిగిన వరద

Sep 14 2019 4:47 AM | Updated on Sep 14 2019 4:47 AM

Increased flooding of Krishna and Godavari Rivers - Sakshi

సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్‌: కృష్ణా, గోదావరి, వంశధార నదుల వరద శుక్రవారం మళ్లీ పెరిగింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి నుంచి 1.67 లక్షల క్యూసెక్కులను వదులుతుండగా, నారాయణపూర్‌ నుంచి 1.60 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 2.60 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. తుంగభద్ర జలాశయంలోకి 35 వేల క్యూసెక్కులు వస్తుండగా అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి శుక్రవారం 3.01 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుండగా 3.80 లక్షల క్యూసెక్కులను వదులు తున్నారు. పది గేట్లను తెరిచారు. శనివారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింతగా పెరగనుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 3.46 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.29 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా నది నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 4.11 లక్షలు చేరుతుండగా 4.25 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజ్‌కి భారీ వరద
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రికి 3.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే పరిమాణంలో దిగువకు వరదను విడుదల చేయనుండటంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు.


6.23 లక్షల క్యూసెక్కులు: గోదావరి నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 6.23 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. గొట్టా బ్యారేజీలోకి వంశధార వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజీ నుంచి 19,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

కడలిలోకి 3,066 టీఎంసీలు..
ప్రస్తుత నీటి సంవత్సరంలో(జూన్‌ 1 నుంచి మే 31) కృష్ణా, గోదావరి, వంశధార నదుల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 3,066.36 టీఎంసీల వరద జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. ఇందులో ప్రకాశం బ్యారేజీ నుంచి 358.46 టీఎంసీల కృష్ణా జలాలుకాగా.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 2,647.6 టీఎంసీల గోదావరి వరద నీరు, గొట్టా బ్యారేజీ నుంచి 60.3 టీఎంసీల వంశధార వరద జలాలు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement