కుబేరుడికి అప్లికేషన్ పెట్టాం అంటారేమో!! | implement loan waiver immediately, demands ysrcp | Sakshi
Sakshi News home page

కుబేరుడికి అప్లికేషన్ పెట్టాం అంటారేమో!!

Jun 24 2014 12:34 PM | Updated on Oct 30 2018 6:08 PM

కుబేరుడికి అప్లికేషన్ పెట్టాం అంటారేమో!! - Sakshi

కుబేరుడికి అప్లికేషన్ పెట్టాం అంటారేమో!!

రైతు రుణమాఫీని జాప్యం చేయడానికి కుబేరుడికి అప్లికేషన్ పెట్టాం అంటారేమోనని పాలకపక్షాన్ని ఎద్దేవాచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ప్రసంగించారు.

రైతు రుణమాఫీ విషయంలో కమిటీలు వేశారని, వాటి కాలపరిమితి కూడా అయిపోయిన తర్వాత మరింత జాప్యం చేయడం కోసం కుబేరుడికి అప్లికేషన్ పెట్టాం అంటారేమోనని పాలకపక్షాన్ని ఎద్దేవా చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మంగళవారం నాడు అసెంబ్లీలో మాట్లాడారు. కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని చెప్పారని, ఆ మాట విని ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలు వస్తాయేమోనన్న ఆశతో విడిపోయారని ఆయన అన్నారు.

ఇక నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించడంతో తమకు ఎప్పుడు కార్డులు వస్తాయో.. ఆ డబ్బులు ఎప్పుడు డ్రా చేసుకోవచ్చో అని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. వికలాంగులకు 1500 రూపాయల వరకు పింఛను ఇస్తామన్నారని, కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ విషయంలో అనవసరంగా జాప్యం చేయడం మాని, వెంటనే దాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేయకపోతే రైతులైనా క్షమిస్తారేమో గానీ.. భగవంతుడు మాత్రం క్షమించబోడని గోవర్ధనరెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఆయన మాట్లాడుతుండగానే సమయం అయిపోయిందంటూ అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్.. బీజేపీ సభ్యుడు సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement