పిల్లలను కౌన్సెలింగ్‌తో మార్చుకోవాలి | Sakshi
Sakshi News home page

పిల్లలను కౌన్సెలింగ్‌తో మార్చుకోవాలి

Published Wed, Feb 6 2019 1:17 PM

ICDS Officials Meet Honor Killing Vaishnavi Family - Sakshi

ప్రకాశం, తాళ్లూరు: పరువు హత్యలో కొత్తపాలెం గ్రామంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి వైష్ణవి కుటుంబాన్ని జాతీయ మహిళా కమిటీ సభ్యురాలు తమ్శిశెట్టి రమాదేవి, ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ విశాలక్ష్మి బృందం మంగళవారం కలిశారు. వారి నివాసం వద్దకు వెళ్లి పరిస్థితులను ఆరా తీశారు. వైష్ణవి తాతయ్య అంజిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైష్ణవి పోస్టుమార్టం పూర్తికావటంతో దహన ప్రక్రియలు పూర్తి చేశామని తెలిపారు. అనంతరం సీఐ శ్రీనివాసరావుతో పోలీస్‌స్టేషన్‌లో సమావేశమై కేసు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్‌ కార్యాలయంలో మహిళా కమిటీ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించామని తెలిపారు. తల్లిదండ్రులు క్షణికావేశాన్ని మాని మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను కౌన్సెలింగ్‌ ద్వారా మార్చుకోవాలే కానీ ఇలా క్రూరంగా వ్యవహరించటం తగదని అన్నారు. ఐసీడీఎస్‌ జిల్లా పీడీ విశాలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు విద్యార్థి దశ నుంచే మంచి చెడ్డల విచక్షణను తల్లిదండ్రులు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. యాంత్రిక యుగంలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయిందని, సెల్‌ ఫోన్‌ టీవీల కాలక్షేపంతో పిల్లలకు, తల్లిదండ్రులకు దూరం పెరుగుతోంద న్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా మానవతా విలువలపై విద్యార్థులను నిత్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేటి సమాజంలో ఇటువంటి పరువు హత్యలు జరగటం తీవ్ర పరిణామమని  అన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధిత మహిళల కోసం స్త్రీ, శిశు సంక్షేమం ద్వారా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో సఖీ పథకం కూడా ఒకటి అన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ కేవీపీ రాజకుమారి, జీసీడీఓ జ్యోతి సుప్రయ, గృహ హింస చట్టం లీగల్‌ కౌన్సెలర్‌ సరళ, వన్‌ స్టెప్‌ సఖీ కౌన్సెలర్‌ సాహిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement