నేనున్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు

నేనున్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు - Sakshi


ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తా

ఇన్ని అబద్ధాలాడి సీఎం అయిన ముఖ్యమంత్రి దేశచ రిత్రలో లేరు

పిక్‌పాకెట్‌కు 420 కేసు.. తప్పుడు హామీలతో మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి?

మొదట రైతు ఆత్మహత్యలే లేవన్న చంద్రబాబు.. మా ఒత్తిడితో ఒప్పుకున్నారు

జగన్ వస్తున్నారని భయం తప్ప.. రైతులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

అతి త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది.. మన ప్రభుత్వం వస్తుంది

రైతులు, డ్వాక్రా మహిళలు ఏ ఒక్కరూ అధైర్యపడొద్దు

మూడోరోజు రైతు భరోసా యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్


 

రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:  ‘ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆతర్వాత మరోమాట చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. బాబులా పచ్చి అబద్ధాలు ఆడే సీఎం.. దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. బాబు చేసిన మోసాలతో కష్టాలు వచ్చిన మాట నిజమే. అయితే నాదో విన్నపం. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు నేనున్నా.. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తాం. ధైర్యంగా ఉండండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.


అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజు మంగళవారం కూడేరు, మర్తాడుల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారు? టీవీ ఆన్ చేస్తే ఓ తల్లి మంగళసూత్రం లాక్కుపోతుంటారు. బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. కటౌట్లు, గోడలపై పెద్ద రాతలు రాశారు. వ్యవసాయ రుణా లు, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు అనేక హామీలతో చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాలను టీడీపీ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి పంచారు. కటౌట్లలోని రాతలు కనిపించవని రాత్రిళ్లు లైట్లు అమర్చారు.చివరకు విద్యార్థులనూ వదల్లేదు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబు సీఎం అయ్యాడు. ఇపుడు ఉన్న జాబులు ఊడిపోతున్నాయి. జాబు ఇవ్వకపోతే 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 9 నెలలవుతున్నా దాని ఊసులేదు. ఇదేం టని నిలదీస్తే ‘అయ్యో నేనెప్పుడు చెప్పాను ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని’ అంటున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాకపోవడంతో 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. రుణమాఫీ పుణ్యమా అని పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ కూడా రాని పరిస్థితి. ఈ ఏడాది రూ.57 వేల కోట్లు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు నిర్దేశిస్తే కేవలం రూ.13 వేల కోట్లు  అందించారు. దీంతో రైతులు అధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకుంటున్నారు. చివరకు యూరియా బస్తా రూ. 200 ఉంటే బ్లాక్ మార్కెట్‌లో రూ.450కి రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి.’పిక్‌పాకెట్‌కు 420... మోసాల బాబుపై ఏ కేసు?

‘ఎవరైనా గ్రామాల్లో పిక్ పాకెటింగ్ చేస్తే 420 కేసు నమోదు చేస్తారు. మరి రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి?’ అని ప్రశ్నించారు.జగన్ అంటే భయం తప్ప.. రైతులపై ప్రేమేదీ?

‘అనంతపురంలో 46 మంది రైతులు చనిపోయారు. వారిని ఆదుకోండి’ అని అసెంబ్లీలో బాబుకు విన్నవించాం. అయితే రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని, అందరూ సుఖసంతోషాలతో ఉన్నారని చంద్రబాబు వెటకారం చేశారు. ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకొంటే కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని బాబుకు మనసు రాలేదు. రాష్ట్రంలో 86 మంది రైతులు (గత అసెంబ్లీ సమావేశాల నాటికి) ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 46 మంది రైతులు అనంతలో ఆత్మహత్య చేసుకుంటే మీకు అర్థం కాదా? అని నిలదీశాను.


ప్రతీ ఇంటికి నేను వెళ్లి పరామర్శించి భరోసా కల్పిస్తానని, అప్పుడు రైతులు ఎలా చనిపోయారో మీకు తెలుస్తుందని చెప్పాను. తీరా నేను అనంతపురానికి వచ్చేందుకు తేదీలు, ప్రోగ్రాం ఖరారు చేశాక.. జగన్ వస్తున్నారని అధికారులను పరుగులు పెట్టించారు. ఎవరూ చనిపోలేదన్న బాబు 29 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెక్‌ల పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అంటే జగన్ వస్తున్నారని ఇదంతా చేశారు. జగన్ వస్తున్నారనే భయం తప్ప. రైతులంటే చంద్రబాబుకు ప్రేమ ఎక్కడ ఉంది?’ అని నిలదీశారు.ప్రాజెక్టుల విషయంలో బాబు చేసింది సున్న

‘హంద్రీ-నీవా తన వల్లే వచ్చిందని చంద్రబాబు గొప్పులు చెబుతున్నారు. తాను సీఎంగా ఉన్న కాలంలో ఆయన విడుదల చేసింది రూ.13 కోట్లే. ఆ తర్వాత సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5,800 కోట్లు ఇచ్చి ప్రాజెక్టు పనులను శరవేగంగా చేయించారు. మరో రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ నిధులివ్వరు. అయితే  మొత్తం ఘనత మాదే అని, ఇక్కడికి వస్తే నాకు 60 శాలువాలు కప్పారని అంటున్నారు. హంద్రీ-నీవాను పూర్తిచేసింది వైఎస్ తప్ప బాబు కాదు. గాలేరు-నగరి, వెలిగొండతోపాటు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా బాబు చేసింది సున్న’ అని చెప్పారు.అతి త్వరలో బాబు ప్రభుత్వం కూలిపోతుంది

 ‘మళ్లీ చెబుతున్నా.. ఏ ఒక్కరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందరం ప్రభుత్వం మెడలు వంచుదాం. అతి త్వరలోనే బాబు ప్రభుత్వం కూలిపోతుంది. మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండండి. ప్రజలను ఒకసారి మోసం, వంచన చేయొచ్చు. పదేపదే చేయలేరు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. ఢిల్లీలో  ఆప్‌కు 67 సీట్లు వచ్చినట్లుగా మన పార్టీకీ అదే ఫలితాలు వస్తాయి.మూడు కుటుంబాలకు భరోసా

మూడోరోజు యాత్రలో జగన్ మూడు కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కూడేరు మండలం అంతరగంగలో ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులు నేసే వన్నూరప్ప, నారాయణమ్మ కుటుంబాన్ని పరామర్శిం చారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తర్వాత శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు తాతిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత శింగనమల మండలం లోలూరులో ఆత్మహత్య చేసుకున్న గోవిందరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


మూడోరోజు యాత్రలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, కార్యదర్శులు వై.మధుసూదన్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాల ఇన్‌చార్జీలు నవీన్‌నిశ్చల్, ఉషాశ్రీ చరణ్, తిప్పేస్వామి, వీఆర్ రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అండగా ఉంటా..

కూడేరు: ‘మీకు అండగా నేను, వైఎస్సార్ సీపీ నేతలు ఉంటాం. ఏ కష్టమొచ్చినా స్థానిక నేతలకు చెప్పండి. ఆత్మస్థైర్యం నింపుకొని ధైర్యంగా జీవించండి. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందకపోతే మీతో కలసి కలెక్టర్ ఎదుట ధర్నా చేసి న్యాయం జరిగేలా చేస్తా’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజు మంగళవారం ఆయన అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులు నేసే వన్నూరప్ప (50), నేసే నారాయణమ్మ (45) కుటుంబాన్ని పరామర్శించారు.


ప్రభుత్వం ఆదుకోకపోయినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు తాతిరెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఆయన భార్య ఆదిలక్ష్మితోపాటు ముగ్గురు పిల్లలతో మాట్లాడారు. ఆర్థిక సమస్యలతో ముగ్గురు పిల్లలు చదువుకోవడం లేదని తెలిసి జగన్ తీవ్రంగా బాధపడ్డారు. పెద్దకుమారుడికి తక్షణమే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని శింగనమల నేత సాంబశివారెడ్డికి సూచించారు. తక్కిన ఇద్దరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం మంగళవారం అర్ధరాత్రి శింగనమల మండలం లోలూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు గోవిందరెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top