పెరుగుతున్న గోదా‘వడి’ | Huge Flood Inflow To Godavari | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోదా‘వడి’

Sep 6 2019 9:38 AM | Updated on Sep 6 2019 9:38 AM

Huge Flood Inflow To Godavari - Sakshi

దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

సాక్షి, నెల్లిపాక (తూర్పు గోదావరి): మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 36 అడుగులకు చేరుకొంది. బుధవారం సాయంత్రం వరకూ శాంతంగా ఉన్న గోదారమ్మ ఉదయానికి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. భద్రాచలం వద్ద నది నిండుకుండలా మారింది. శుక్రవారం ఉదయానికి నీటిమట్టం 38 అడుగులకు వరద చేరవచ్చని కేంద్ర జలసంఘం తెలిపింది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎటపాక మండలం నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగుల్లోకి గోదావరి వరద పోటెత్తింది. దీంతో పరీవాహక ప్రాంత మిర్చి రైతుల్లో ఆందోళన నెలకొంది. గత నెలలో వచ్చిన వరదలకు పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లగా, ఇప్పుడు మిర్చి తోటలపై గోదావరి వరద ప్రతాపం చూపుతుందేమోనని వారు దిగులు చెందుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి మరింత భారీగా వరద వస్తే.. ముంపు ముప్పు తప్పదని భావిస్తున్నారు.

జలదిగ్బంధంలో గిరిజన గ్రామాలు
దేవీపట్నం (రంపచోడవరం):
గోదావరికి మరోసారి ఉధృతంగా వరద రావడంతో దేవీపట్నం మండలం తొయ్యేరు ఆర్‌అండ్‌బీ రహదారి చప్టా పైకి చేరింది. దీంతో మండలంలోని పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకూ దేవీపట్నం వద్ద పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గత నెలలో 16 రోజుల పాటు గోదావరి వరదల కారణంగా మండలంలోని 36 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మరోసారి వరద రావడంతో నదీ పరివాహక గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

5.04 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం): కాటన్‌ బ్యారేజీ నుంచి గురువారం 5,04,510 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి ఉపనది ప్రాణహిత పొంగి పొర్లుతూండటంతో ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని హెడ్‌వర్క్స్‌ ఈఈ, ఫ్లడ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌.మోహనరావు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరుకుంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 9,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.86 మీటర్లు, పేరూరులో 11.24 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.85 మీటర్లు, భద్రాచలంలో 36 అడుగులు, కూనవరంలో 13.46 మీటర్లు, కుంటలో 8.16 మీటర్లు, పోలవరంలో 10.86 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.80 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement