ఇంటర్నేషనల్‌ స్కూళ్లపై యమా క్రేజ్‌

Huge Craze on International Schools - Sakshi

భారత్‌లో 708 స్కూళ్లు.. ఏడేళ్లలో రెట్టింపు 

సాక్షి, అమరావతి: గత దశాబ్దన్నర కాలంగా దేశీయ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కాన్వెంట్లు పోయి కార్పొరేట్‌ స్కూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రెండ్‌లోను మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంటర్నేషనల్‌ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని ప్రముఖ సంస్థ ఐఎస్‌సీ(ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కన్సల్టెన్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఏడేళ్ల వ్యవధిలో దేశంలో ఇంటర్నేషనల్‌ స్కూళ్ల సంఖ్య రెండింతలవడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. అలాగే ఇంటర్నేషనల్‌ స్కూళ్ల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉందని, వాటి ట్యూషన్‌ ఫీజుల టర్నోవర్‌ ఏకంగా రూ.8,615 కోట్లకు చేరిందని వెల్లడించింది.  

అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు అందించాలనే తాపత్రయంతో ధనిక వర్గాలే కాకుండా ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా తమ పిల్లల్ని ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఐఎస్‌సీ తాజా నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్‌ స్కూళ్ల సంఖ్యలో చైనా మొదటి స్థానంలో నిలవగా.. మనం రెండో స్థానం దక్కించుకున్నాం.  

విదేశీ విద్యపై మోజుతోనే.. 
గత 15 ఏళ్లుగా ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాఠశాల విద్య కూడా ఇంటర్నేషనల్‌ సిలబస్‌లో ఉంటే మంచిదనే భావన తల్లిదండ్రుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2012 నాటికి దేశంలో ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమైన ఇంటర్నేషనల్‌ స్కూళ్లు ఇప్పుడు చిన్న నగరాలకు కూడా విస్తరించాయి. ఇవి ఎక్కువగా కేంబ్రిడ్జ్‌ ప్రైమరీ, సెకండరీ, అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రాం కోర్సులు అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా విశేష గుర్తింపున్న ‘ఇంటర్నేషనల్‌ జనరల్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌’ కోర్సులో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో చదువుతున్న వారిలో 63.40 శాతం భారతీయులు కాగా మిగిలినవారు విదేశీయుల పిల్లలు. విదేశీ దౌత్యవేత్తలు, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయుల పిల్లలు దాదాపు 36 శాతం ఉన్నారు.  

భారీగానే ఫీజులు 
మన దేశంలోని ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ. 2.87 లక్షల నుంచి రూ. 7.17 లక్షల వరకు ట్యూషన్‌ ఫీజుగా వసూలు చేస్తున్నారు.  అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువేనని ఐఎస్‌సీ నివేదిక పేర్కొంటుంది. మన దేశంలో ఇంటర్నేషనల్‌ స్కూళ్ల సగటు వార్షిక ఫీజు రూ. 2.36 లక్షలు కాగా.. చైనాలోరూ. 11.29 లక్షలు, యూఏఈలో రూ. 5.79 లక్షలుగా ఉంది. మున్ముందు దేశంలో ఇంటర్నేషనల్‌ స్కూళ్ల ప్రాభవం మరింతగా పెరుగుతుందని ఐఎస్‌సీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఎస్‌సీ 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు సంబంధించిన డేటాను సేకరిస్తూ విశ్లేషిస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top