ఉపాధి పనులు.. అవినీతి పుట్టలు

Huge Corruption Occured In MGNREGA At Nellore - Sakshi

సామాజిక తనిఖీలో బట్టబయలు చేసిన సోషల్‌ ఆడిట్‌ బృందాలు

సాక్షి, చిట్టమూరు (నెల్లూరు): మండలంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి జరిగినట్లు సోషల్‌ ఆడిట్‌ బృందాలు బట్టబయలు చేశాయి. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం డ్వామా అడిషనల్‌ పీడీ నాసర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి జరిగిన పనుల్లో మండలంలోని 23 పంచాయతీల్లో ఆడిట్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 1,699 పనులకు రూ.6,75,20,524 మేర పనులు జరిగాయని అధికారులు ధ్రువీకరించారు. మండలంలో ప్రధానంగా యాకసిరి, మెట్టు, ఎల్లసిరి, ఆలేటిపాడు, అరవపాళెం, ఆరూరు, మొలకలపూడి పంచాయతీల్లో భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు తనిఖీ బృందాలు సమావేశంలో చదివి వినిపించారు.

యాకసిరి పంచాయతీలో సుమారు 25 మంది పనికి రాకపోయినా, వారికి మస్టర్లు వేసి కూలి నగదు దుర్వినియోగం చేశారని నిర్ధారించారు. చేసిన పనుల్లో కూడా రికార్డులో చూపిన క్యూబిక్‌ మీటర్లు పని క్షేత్రస్థాయిలో అంత పని జరక్కపోగా నిధులు మాత్రం డ్రా చేశారన్నారు. ఇదే పంచాయతీ కృష్ణనాయుడుకండ్రిగ గ్రామస్తులకు కావాలనే పనులు కల్పించలేదని కూలీలు తెలిపారన్నారు. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించకుండా పనులు చేశారన్నారు. ఎల్లసిరి, మొలకలపూడి పంచాయతీల్లో చెట్లు నాటకుండా నాటినట్లు రికార్డులు చూపడంతో పాటు, చెట్ల చుట్టూ ట్రీగార్డులు ఏర్పాటు చేసినట్లు రికార్డులు చూపి నిధులు దిగమింగినట్లు పేర్కొన్నారు. మస్టర్‌లో సంతకాలు లేకుండా పేమెంట్‌ చేశారన్నారు. అరవపాళెంలో పనులకు రాకుండా వచ్చినట్లు హాజరు వేసి నగదు చెల్లింపులు చేశారన్నారు.

గుంత పూడిక తీతకు సంబంధించి 144 క్యూబిక్‌ మీటర్లు పనులు చేయకుండా నిధులు డ్రా చేశారన్నారు. చెట్లు నాటకుండానే చెట్లు నాటినట్లు రికార్డుల్లో చూపి నగదు చెల్లింపులు చేశారన్నారు. ఆరూరు పంచాయతీలో పక్కాగృహాలకు సంబంధించి ఇంటింట నిర్మాణాలు పూర్తి కాకుండానే ఉపాధి పథకంలో కూలీల పేరుతో పూర్తి నగదు చెల్లింపులు చేశారన్నారు. పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదని తనిఖీ బృందాలు పేర్కొన్నాయి. పనులకు సంబంధించి గ్రామంలో గ్రామ సభ నిర్వహించకుండా ఇష్టానుసారంగా పనులు చేశారన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిధులు దుర్వినియోగం జరిగిన పనులకు సంబంధించి రికవరీ చేస్తామన్నారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్‌ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సురేష్‌ బాబు, ఐఎంపీ దుర్గమ్మ, ఎస్‌ఆర్‌పీ కనకారావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top