అక్వేరియం.. ఆహ్లాదం.. ఆనందం

How To Maintain Aquarium With Easy Steps - Sakshi

నివాసాలు, వ్యాపార సంస్థల్లో అక్వేరియం ఏర్పాటుపై ఆసక్తి

అందుబాటులో 40 రకాల చేపలు

ఆన్‌లైన్‌లో పెరిగిన విక్రయాలు

ఇంటిని నిర్మించుకోవడం.. ఆ ఇంటికి అందాలు అద్దడం ఓ కళ. ఇంటి పరిసరాలను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు రంగు రంగుల బొమ్మలు, పోస్టర్లు అతికిస్తారు. ఇంటి బయట అరుదైన మొక్కలు నాటుతారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. ఇంటీరియల్‌ డెకరేషన్‌కు ఎంత ఖర్చు అయినా వెనకాడటం లేదు. అరుదైన విగ్రహాలు, ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్‌ వస్తువులతో పాటు అక్వేరియం ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటికొచ్చే వారిని ఆకట్టుకునేందుకు కొందరు, వాస్తు పేరుతో మరి కొందరు అక్వేరియాన్ని తెచ్చేసుకుంటున్నారు. అందులో అందమైన చేపలు పెంచుతూ ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పొందుతున్నారు.

సాక్షి, ఒంగోలు: మనిషి జంతువులను పెంచుకోవడం, వాటితో సరదాగా గడపడం ఎప్పటి నుంచో ఉంది. అలాగే పురాతన కాలం నుంచి జంతువులను, జలచరాలను పూజిస్తున్నారు. జలచరాల్లో తాబేలు, చేపకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో చేప, తాబేలు ఉంచితే అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో పూర్వం సంప్‌లాంటి నిర్మాణంల్లో వాటిని ఉంచే వారు. ప్రస్తుతం వాటి స్థానంలో అక్వేరియాలు వచ్చేశాయి. గాజు ఫలకాలతో నిర్మించిన డబ్బాలో అందమైన చేపల కదలికలను చూస్తే మనసుకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది భావిస్తున్నారు. దీంతో అక్వేరియం ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. నివాసాల్లో, పెద్ద పెద్ద హోటళ్లు, కార్పొరేట్‌ ఆఫీసులు, బ్యాంకులు, వ్యాపార సంస్థల్లో అక్వేరియాలు ఏర్పాటు చేసి అందులో అరుదైన చేపలను ఉంచి ఆకట్టుకుంటున్నారు.

గతంలో దేశవాళి చేపలనే పెంచుకునే వారు. ప్రస్తుతం అమెరికా, స్వీడన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి 40కిపైగా చేపలు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, ముంబాయి, బెంగళూరు వంటి మహానగరాలకు చేపలు దిగుమతి కాగా.. అక్కడి నుంచి జిల్లాలో పలువురు వ్యాపారులు తెచ్చుకుని స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు, ఆదోని, నంద్యాల తదితర ప్రాంతాల్లో 20కి పైగా అక్వేరియం షాప్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఆన్‌లైన్‌లో రోజుకు 10 నుంచి 15 వరకు అక్వేరియం డబ్బాలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో అక్వేరియం ధర రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. చేపల్లో అత్యధికంగా ప్రజలు ఆసక్తి చూపి కొనే చేప గోల్డ్‌ ఫిష్‌ కాగా, దానికి ఆహారంగా ఇచ్చే బ్లడ్‌మాన్స్‌ ధర అత్యధికంగా రూ.1500 ఉంది.

ఆహారం ధర

అనీఫుడ్‌ రూ.160
టయాఫుడ్‌ రూ.40
వసాకిఫుడ్‌ రూ.40
ఫ్రాన్స్‌ఫుడ్‌ రూ.1000
బ్లడ్‌మూన్‌ ఫుడ్‌ రూ.1500

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి కావడంతో సాధారణ వాతావరణంలోనే జీవిస్తాయి. 
అక్వేరియంలో ప్రత్యేకంగా నీటి పంపు, ఆక్సిజన్‌ పంపు అవసరం.
చేపలకు సమపాళ్లలో, రెండు పూటల ఆహారం అందించాలి. 
అక్వేరియం అందంగా ఉంచేందుకు ఆల్చిప్పలు, గవ్వలు, చిన్నపాటి పడవ తదితర ఆకారాలతో పాటు సముద్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలి.  
అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపలు ఉంచితే చేపల విసర్జితాలు ఎక్కువై అమ్మోనియం పాలు అధికమవుతోంది. ఈ పదార్థం చేపలకు హానికరంగా మారుతుంది. 
అక్వేరియంలో నీటిని మార్చకపోతే బ్యాక్టిరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. 
నీటిని తరుచూ మార్చుతూ ఉండాలి. పెద్దది అయితే వారానికో సారి, చిన్నది అయితే రెండు రోజులకోసారి మార్చాలి.  
చేపలను నేరుగా నెట్‌ అవుట్‌ చేయకుండా నీళ్లు ఉన్న కంటైనర్‌ సహాయంతో బయటకు తీస్తే మంచిది. లేదంటే కొన్ని చేపలు అభద్రతభావంతో చనిపోయే ప్రమాదం ఉంది.  

చేపల ఆహారం
చేపలకు మామూలు ఆహారం ఇస్తే వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రత్యేకించి తయారు చేసిన ఆహారాన్నే వాటికి ఇవ్వాలి. వాటికిచ్చే ఆహారంలో నాణ్యత తక్కువైనా, పరిమాణం ఎక్కువైనా చేపలకు ప్రమా దమే. ప్రత్యేకంగా తయార య్యే ఆహారాన్ని వ్యాపారులు బెంగళూరు నుంచి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. చేపలకు రెండు పూటలా ఆహారం ఇవ్వాలి

చేపలు.. రకాలు
అక్వేరియంలో పెంచే చేపలు చాలా అరుదైనవి. వాటిలో గోల్డ్‌ఫిష్, షార్క్, టైగర్‌ఫిష్, ఫైటర్, బ్లాక్‌మాలిష్, సిల్వర్‌మాలిష్, పికాక్‌ ఫిష్, ఎస్‌కే గోల్డ్, ఎంజల్‌ఫిష్, సోలైన్, అర్తోనా, ఫ్లోరేన్‌ఫిష్, ఫిరోనాస్, చిక్స్‌లైట్స్, ఆస్పర్స్, ఇస్కార్స్, షిఫర్, సియాంజల్‌ వంటి చేపలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని శాస్త్రీయ నామాలతోనే పెంపకం దారులు పెంచుకుంటున్నారు. ఇవన్నీ సముద్రపు చేపల సంతతి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top