చేపల టీచర్‌..! | Parvathy Vinod a sociology graduate began rearing Ornamental Fish | Sakshi
Sakshi News home page

చేపల టీచర్‌..!

May 25 2025 10:21 AM | Updated on May 25 2025 10:21 AM

Parvathy Vinod a sociology graduate began rearing Ornamental Fish

అక్వేరియం చేపల పెంపకంలో ఉన్న పార్వతి నెలకు రు.50 వేలకు పైగానే సంపాదిస్తారు. కానీ అంతకు మించిన సంతోషం ఆమెకు వేరే ఉంది! చేపల పెంపకంలో శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే కొల్లమ్‌లోని ‘కాలేజ్‌ అండ్‌ ఫిషరీస్‌ స్కూలు’ విద్యార్థులు తనను ‘‘టీచర్‌.. టీచర్‌..’’ అంటూ సందేహాలు అడుగుతుండటం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతారామె.

పార్వతి సోషియాలజీ గ్రాడ్యుయేట్‌. 18 ఏళ్ల క్రితం – పెళ్లయే వరకు ఆమెకు అక్వేరియం చేపల పెంపకం అనే ఆలోచనే లేదు. మెట్టినింటి వాళ్లకు చేపల వ్యాపారం ఉంది. ఎనిమిది చేపల చెరువులు ఉన్నాయి. వాటిల్లో వేటికవిగా... తినే చేపల్ని, అక్వేరియం చేపల్ని పెంచుతుంటారు. భర్తతో కలిసి చేపల చెరువులకు వెళ్లొస్తుండటం, వాటిని మార్కెట్‌ చేయటం వంటివి చూస్తూ క్రమంగా తనూ చేపల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు పార్వతి. 

అయితే పార్వతి కేవలం అక్వేరియం చేపల పెంపకాన్ని మాత్రమే ఎంచుకున్నారు. వీటినే ఆర్నమెంట్‌ చేపలనీ, రంగు చేపలనీ అంటారు. ఇప్పుడంటే ఆమె తన ‘దేవూస్‌ ఆక్వా ఫామ్‌’ నిర్వహణతో పూర్తిగా మెలకువల్ని తెలుసుకోగలిగారు కానీ, మొదట్లో ఆ చేపల్ని పెంచటం చాలా కష్టంగా ఉండేదట! ‘‘కొన్నిసార్లు కుంటలోని అక్వేరియం చేపలు మొత్తం చనిపోయి కనిపించేవి. నష్టం మాట ఎలా ఉన్నా ఆ చిన్ని ప్రాణులు విగతజీవులై నీటి పైన తేలియాడుతూ ఉండటం చూసి మనసుకు ఎంతో బాధ కలిగేది’’ అంటారు పార్వతి. 

దాచుకున్న డబ్బుతో..!
వివిధ సైజులలోని 21 సిమెంటు కుంటలలో అక్వేరియం చేపల్ని పెంచుతున్నారు పార్వతి. ఈ బ్రీడింగ్‌ ట్యాంకులు పెద్దవిగా ఉంటాయి. బేబీ ఫిష్‌లను ఆ పెద్దవాటికి దూరంగా ఉంచటం కోసం ప్రత్యేకంగా మరి కొన్ని చిన్న ట్యాంకులు ఉంటాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకం కింద రుణంగా తీసుకున్న డబ్బు కొంత, తన దగ్గరున్న దాచుకున్న డబ్బు కొంత కలిపి రు.15 లక్షల పెట్టుబడితో ఈ అక్వేరియం చేపల (ఆర్నమెంట్‌ ఫిష్‌) బిజినెస్‌ను ప్రారంభించారామె. 

పార్వతికి కొల్లమ్, అలెప్పి, కొట్టాయం, తిరువనంతపురం, పఠనంతిట్ట, ఇంకా ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాలలో క్లయింట్లు ఉన్నారు. చిన్న దుకాణాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నెలకు తక్కువలో తక్కువగా రు.15 వేలు, ఎక్కువలో ఎక్కువగా లక్ష వరకు రాబడి ఉంటోంది. ప్రస్తుతం కాయ్‌ కార్ప్, మార్ఫ్, క్రిబెన్సిస్, జులిడోక్రోమిస్, బ్యూటికాఫ్యూరి, ఫ్రంటోసా, జెబ్రా డేనియోస్, రెయిన్‌ బో సిక్లిడ్, హెకెల్లి, మూన్‌ లైట్‌ గోరమి రకం రంగు చేపల్ని తన ఫామ్‌లో ఉత్పత్తి చేస్తున్నారు పార్వతి. 

మొదట్లో అన్ని చోట్లా దొరికే ఏంజెల్, గుప్పి, ఫైటర్, గోల్డ్‌ఫిష్‌ రకాల్ని మాత్రమే పెంచేవారు. చేప రకాన్ని బట్టి బ్రీడింగ్‌ ఉంటుంది. ‘‘మార్ఫ్‌ వెరైటీలో ఆడ చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మగ చేపలు తమ నోటిలో పొదుగుతాయి. అది మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మగ చేపల్ని వేరే కుంటలోకి మారుస్తాం’’ అని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తారు పార్వతి. ప్రస్తుతం ఆమె తన బిజినెస్‌ను మరింతగా విస్తృతపరచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. 

దాచుకోని విద్యతో...!
అక్వేరియం చేపల పెంపకంలోని ఈ అనుభవం అంతా కేవలం నేర్చుకోవటం ద్వారానే పార్వతికి లభించలేదు. పనగఢ్‌లోని ‘కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్డడీస్‌’లో రీసెర్చర్‌గా ఉన్న యానా మెర్సీతో కలిసి కొంతకాలం పని చేశారామె. 

‘‘ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. రాబడిలో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ ముందుకు సాగిపోవాలి. మనకు తెలిసిన విద్యను దాచుకోకుండా,  రాబోయే తరాల వారికి పంచాలి.. ’’ అంటారు పార్వతి.

కొన్ని విశేషాలు

  • ప్రపంచంలో స్టాంప్‌ కలెక్షన్‌ తర్వాత అతి పెద్ద హాబీ ఇంట్లో అక్వేరియం ఉంచుకోవటమే!

  • అక్వేరియంలోని రంగురంగుల చేపల్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో రూఢి అయింది.

  • రంగు చేపల అమ్మకానికి, పెంపకానికి చెన్నైలోని కొళత్తూరు ప్రసిద్ధి.

  • ఆసియాలోని అతి పెద్ద ‘రంగు చేపల మార్కెట్‌’గా కొళత్తూరు గుర్తింపు సంపాదించింది.

  • అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి. వాటికి సమపాళ్లలో రెండు పూటలా ఆహారం అందించాలి.

  • అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపల్ని ఉంచితే, వాటి విసర్జితాలు ఎక్కువై నీటిలో అమోనియం అధికమౌతుంది. చేపలకు హానికరంగా మారుతుంది. 

  • అక్వేరియంలో నీటిని తరచు మారుస్తుండాలి. పెద్ద తొట్టె అయితే వారానికోసారి, చిన్నదైతే రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. 

  • అక్వేరియంలో నీటికి మార్చకపోతే బాక్టీరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. 

  • చేపలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రత్యేక మోతాదుల్లో ఇవ్వాలి. ఈ వివరాలను షాపు వాళ్ల నుంచి తెలుసుకోవచ్చు. 

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

(చదవండి: మన ముచ్చట: పుస్తకానికి గుడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement