
చెన్నాప్రగడ శర్మ, విజయవాడ
దేవుళ్లు, దేవతలకు ఆలయాలు నిర్మించడం అందరికీ తెలిసిందే. అదే మనుషులకైతే ఒకింత ఆశ్చర్యమే మరి! అప్పుడెప్పుడో తమిళనాడులో నటి ఖుష్బూకు అభిమానులు గుడి కట్టించారు. అదే రాష్ట్రంలోని అరియలూర్ జిల్లాలో భార్యపై గల ఇష్టంతో ఓ భర్త ప్రేమ మందిరం నిర్మించాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఓ భార్యామణి మరణించిన భర్త జ్ఞాపకాలను పదిలపరుస్తూ గుడి కట్టారు. ఆమధ్య శ్రీకాకుళంలో ఓ పుత్రుడు తల్లికి, విశాఖపట్నంలో ఇంకో కొడుకు తండ్రికి ఆలయాలు నెలకొల్పి వార్తల్లోకెక్కారు.
వీటన్నింటినీ పక్కన పెడితే, కేరళ రాష్ట్రంలో విశేషమైన జ్ఞాన ఆలయం ఒకటుంది. కన్నూర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో చెరుపుళ పట్టణ సమీపంలోని ప్రపోయిల్ అనే చిన్న గ్రామంలో పుస్తకానికి గుడి కట్టారు. లోపల దేవుళ్లుండరు. పుస్తకమే దేవత. దానికే పూజాదికాలు నిర్వహిస్తారు. నైవేద్యంగా సమర్పించిన పుస్తకాలనే తిరిగి ప్రసాదంగా వితరణ చేస్తారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఈ గుడికి వెళ్లి పూజలు చేయవచ్చు. ఇక్కడ పూజారులు ఉండరు, హుండీలు కనిపించవు. ఇది నవపురం మతాతీత ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు.
తొలి అడుగు...
జ్ఞానం కంటే ఉన్నతమైన మతం మరొకటి ఉండదని భావించిన విద్యావేత్త, చెరుపుళ విన్నర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.నారాయణ ఈ పుస్తకాలయ రూపశిల్పి. సహజ సిద్ధమైన పెద్ద రాతిపై విగ్రహ రూపంలో పుస్తకం దర్శనమిస్తుంది. దీన్ని కాసర్‌గోడ్ జిల్లా కంబల్లోర్ గ్రామానికి చెందిన సంతోష్ మానసం అందంగా చెక్కారు. 2021 మార్చి 4న ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా, అక్టోబరులో విగ్రహ ప్రతిష్ఠాపన జరిపి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయం చుట్టూ పచ్చదనం పరచుకుని ఉంటుంది. సందర్శకులు ప్రవేశ ద్వారం గుండా లోపలికి అడుగిడగానే నిశ్శబ్దం రాజ్యమేలుతోందా అన్నట్లు ఉంటుంది. ప్రవేశ ద్వారం గోడలు కేరళ రాష్ట్ర సాహితీ సాంస్కృతిక వారసత్వాలను వివరించే శిల్పాలతో నిండి ఉంటాయి.
ఒకవైపు బుద్ధుడి చిత్రం, మరో చిహ్నంగా రాతి దీపం కనిపిస్తుంటాయి. ఆలయ ప్రధాన దేవత ఒక భారీ కాంక్రీటు పుస్తకం. 30 అడుగుల ఎత్తులో సహజమైన రాయిపై ఉంది. దాని చుట్టూ అనేక పొత్తాలు చిత్తాన్ని దోచే రీతిలో అందంగా అలంకరించి ఉంటాయి. ఒకవైపు పాత, కొత్త పుస్తకాల వాసన, మరోవైపు చందన పరిమళాలు, ఇవి చాలవన్నట్లు వేసిన ధూపం తాలూకు గుబాళింపు నాసికా రంధ్రాలకు చేరి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.
ఆలయానికి రూ.7.6 కోట్లు
వారసత్వ ఆస్తిగా రెండెకరాల భూమి దక్కించుకున్న నారాయణ స్వయంకృషితో సంపాదించిన ప్రతి రూపాయి ఈ ఆలయం కోసం వెచ్చించారు. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి ఫర్వాలేదు. గుడి కోసం ఇప్పటి వరకు రూ.7.6 కోట్లకుపైగా ఖర్చుచేశారు. ఇందులో కొద్ది శాతం మాత్రమే విరాళాలుగా స్వీకరించారు. ఈ నాలుగేళ్లలో భక్తులు నైవేద్యంగా సమర్పించిన పుస్తకాల సంఖ్య ఐదు వేలకు చేరుకుంది. ఆలయం ఆవరణలో రచయితలు చక్కగా కూర్చుని రాసుకునేందుకు వీలుగా మూడు షెడ్లు ఏర్పాటు చేశారు.
ఇక్కడ ఏటా రెండు ప్రధాన ఉత్సవాలను నిర్వహిస్తారు. సాహిత్య చర్చలు, నృత్య ప్రదర్శనలు, పుస్తకావిష్కరణలు, సెమినార్లు, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా రచయితలకు అవార్డులు ప్రదానం చేస్తారు. జ్ఞానోదయం దైవత్వానికి నిజమైన మార్గమని ఈ ఆలయం దర్శించుకున్నవారికి అనుభూతి కలుగుతుంది. జ్ఞానం, విద్య, మానవ పురోగతి, ఆధ్యాత్మిక ప్రగతికి ఈ ఆలయం పునాది అనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జ్ఞానారాధన కేంద్రం. ∙