
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య(23) హత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న గోవిందచామీ అలియాస్ ఛార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ శాఖ కేరళవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలో.. ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని పట్టుకోగలిగారు.
2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు చార్లీ థామస్. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ నాలుగు రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులో ఘటన జరిగిన మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లీ.. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు.
తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ.. ఆపై తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్‌ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక.. రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసు శాఖ స్టేట్ వైడ్ అలర్ట్ ప్రకటించింది. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు.. ఇలా అన్నిచోట్ల చార్లీ ఫొటోలతో గాలింపు ముమ్మరం చేసింది. చార్లీని గుర్తిస్తే 9446899506 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది.
ఈలోపు.. కన్నూరు తలప్పు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. అక్కడ బావిలో దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ఉదయం. 11గం. ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు.

2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసి, ట్రాక్ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అటుపై ఆమె ఫోన్‌తో ఉడాయించాడు. ఆ ఫోన్ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇటు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.
ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గోవిందచామీకి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలోనూ అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. అయితే..
2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్ అభియోగాన్ని తొలగించి.. కేవలం రేప్‌కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది.
అంత కట్టుదిట్టమైన భద్రత నుంచి ఎలా?
కన్నూరు సెంట్రల్ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని, అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటి? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చార్లీ కరడుగట్టిన నేరస్తుడు. అర్ధరాత్రి 1గం. సమయంలో తప్పించుకున్నాడు. అధికారులేమో ఉదయం 5గం. గుర్తించారు. ఏడుగంటలకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్ పోయింది. ఇది పక్కా స్కెచ్‌తోనే జరిగి ఉంటుంది’’ అనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. అయితే కేరళ పోలీస్ శాఖ మాత్రం అతని కోసం వేట కొనసాగుతోందని తెలిపింది. ఈలోపు అతను దొరకడం విశేషం.