కోర్టును ఆశ్రయించారన్న ఏకైక కారణంతో ఓ వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని నిలిపేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఉన్నతాధికారుల తీరు అన్యాయమంటూ హైకోర్టు తప్పుపట్టింది.
సాక్షి, హైదరాబాద్: కోర్టును ఆశ్రయించారన్న ఏకైక కారణంతో ఓ వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని నిలిపేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఉన్నతాధికారుల తీరు అన్యాయమంటూ హైకోర్టు తప్పుపట్టింది. ఇందుకుగాను ఎస్‌బీహెచ్‌కి రూ. 10 వేల జరిమానా విధించింది. బాధితుడికి ఉద్యోగం ఇవ్వడమేగాక సర్వీసు ప్రయోజనాలన్నీ వర్తింపచేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఇటీవల తీర్పు వెలువరించారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) పోస్టుల భర్తీకి 1999లో ఎస్‌బీహెచ్ నోటిఫికేషన్ ఇవ్వడంతో వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన జింకా వెంకటరమణ దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. అయితే ఫలితాలు ఆలస్యం కావడంతో ఈలోగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) పోస్టుకు ఆయన ఎంపికయ్యారు.
అయితే ముంబై శాఖలో పోస్టింగ్ ఇవ్వడంతో వెంకటరమణ బాధ్యతలు తీసుకున్నప్పటికీ అక్కడి వాతావరణం నచ్చక రాజీనామా చేశారు. తర్వాత ఎస్‌బీహెచ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) పోస్టులో వెంకరమణ నియామకానికి సీఆర్‌బీ సిఫారసు చేసింది. అయితే అదే సమయంలో జనరల్ కేటగిరీకి చెందిన దేవనాయగం అనే వ్యక్తి ఓబీసీ కేటగిరీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) పోస్టులో నియమితులయ్యా రు. దీన్ని సవాలు చేస్తూ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సదరు పోస్టుకు సీఆర్‌బీ తన పేరు సిఫారసు చేసిందని తెలుసుకొని తరువాత తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కానీ, తమపై కోర్టుకెక్కిన వ్యక్తికి ఉద్యో గం ఇవ్వరాదంటూ ఉన్నతాధికారులు వెంకటరమణ నియామకపు ఉత్తర్వులను నిలిపివేశారు.