కోడి పందాలాడితే పేకాట కేసు | Hen open the possibility of racing poker case | Sakshi
Sakshi News home page

కోడి పందాలాడితే పేకాట కేసు

Dec 17 2014 12:58 AM | Updated on Aug 11 2018 8:45 PM

కోడి పందాలాడితే పేకాట కేసు - Sakshi

కోడి పందాలాడితే పేకాట కేసు

పలుకుబడి ఉన్న పెద్దలంతా కార్లలో దిగారు. రూ.లక్షల్లో కోడిపందాలు, పేకాట ఆడారు. ఎవరో ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చేరుకున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టని పోలీసులు
రెండోసారి ఫిర్యాదు చేశాక స్పందన
పదిమందిపై పేకాట కేసు నమోదు
కోడిపందాలాడినా స్పందించని వైనం

 
పలుకుబడి ఉన్న పెద్దలంతా కార్లలో దిగారు. రూ.లక్షల్లో కోడిపందాలు, పేకాట ఆడారు. ఎవరో ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చేరుకున్నారు. మూడు కోళ్లను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. ఈసారి ఫిర్యాదు పోలీసు ఉన్నతాధికారులకు వెళ్లింది. మళ్లీ పోలీసులు వచ్చారు. పదిమందిపై పేకాట కేసు పెట్టి తీసుకెళ్లారు. పలుకుబడి గల వ్యక్తులు కావడంతో పేకాట కేసు పెట్టి అయిందనిపించారు. ఆద్యంతం నాటకీయంగా సాగిన ఈ వ్యవహారానికి వేదిక పాల్మన్‌పేట ప్రాంతంలోని రామాంజనేయ హేచరీ.
 
పాయకరావుపేట: పాల్మన్‌పేట ప్రాంతంలోని హేచరీ వద్ద మంగళవారం ఉదయం కోడి పందాలు, పేకాట ప్రారంభమయ్యాయి. విజయవాడ, గుంటూరు, అమలాపురం, కాకినాడ, యానాం, తుని ప్రాంతాలనుంచి కోడి పందాలు, పేకాట ఆడేందుకు పందెం రాయుళ్లు కార్లతో చేరుకున్నారు. ఉదయం నుంచి 11 గంటల సమయానికి సుమారు  రూ.40 నుంచి రూ.50 లక్షలు చేతులు మారినట్టు ఆ ప్రాంత  మత్స్యకారులు చెబుతున్నారు. హేచరీలో పందాలు జరుగుతున్నాయని ఉదయం 8 గంటల సమయంలో ఆ ప్రాంత యువకులు కొందరు ఫోన్‌లో పాయకరావుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 11 గంటల ప్రాంతానికి పోలీసులు అక్కడికి చేరుకుని హేచరీ ప్రాంతంలోని మూడు పందెం కోళ్లను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చేశారు తప్ప ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

ప్రముఖులు కావడం వల్లే...

దీంతో ఆ ప్రాంతీయులు మరల జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నక్కపల్లి పోలీసులు దాడులు జరిపి పది మందిని పట్టుకుని నక్కపల్లి తీసుకెళ్లారు.నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో పాయకరావుపేట పోలీసులు ఆ పది మందిపై పేకాట కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడ్డ పదిమందిలో పలుకుబడిగల వ్యక్తులు ఉండటంతో కోడిపందాలు ఆడుతున్నా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. పదిమంది పేకాటరాయుళ్ల నుంచి రూ.3,61,200 స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేగేశ్వరి సత్యనారాయణరాజు, పెనుమచ్చ పెద్దిరాజు, కె.సత్యనారాయణ, పి.వెంకట్రావు, వి.పల్లంరాజు, సిహెచ్.సురేష్‌వర్మ, పి.రంగరాజు, కె.సూర్యనారాయణ, యడ్ల శంకర్, కాకి రమేష్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement