ప్రాణానికి రక్ష హెల్మెట్‌

Helmet mandatory For Two Wheelers - Sakshi

తనిఖీలు, జరిమానాలతో మారని తీరు

26 నుంచి తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశం

నెల్లూరు(మినీబైపాస్‌): వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలన్న చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, శిరస్త్రాణం లేకుండా పట్టుబడ్డ ద్విచక్రవాహనదారులకు చట్ట ప్రకారం హెల్మెట్‌ ధర కన్నా ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాలని, దీనిని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 26 నుంచి అమలు చేయాల్సిఉంది.

కన్నవారికి కడుపుకోత
జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. వీరిలో హెల్మెట్లు ధరించకపోవడం వల్ల మృతిచెందిన వారే అధికంగా ఉంటున్నారు. హెల్మెట్‌ వినియోగంపై పోలీసులు, రవాణశాఖ అధికారులు వివరించినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. జిల్లాలో 5 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలున్నాయి. ప్రతినెలా 5 వేలకు పైగా కొత్తవి రోడ్ల మీదకు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఏటా 25 శాతం మంది ద్విచక్రవాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మోటార్‌ వాహనాల చట్టం 1988 సెక్షన్‌ 129 ప్రకారం ప్రతి ద్విచక్ర వాహనదారుడు, అతని Ðవెనకాల కూర్చున్న వారు తప్పనిసరిగా శిరస్త్రాణం(హెల్మెట్‌) ధరించాల్సిఉంది. ఇదే విషయాన్ని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినా వాహనదారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు.

వాహనంతోనే హెల్మెట్‌..
మోటార్‌ వాహన చట్టం 138(ఎఫ్‌) ప్రకారం ప్రతి డీలరు వాహనం విక్రయించేటప్పుడు వినియోగదారులకు తప్పనిసరిగా ఉచితంగా హెల్మెట్‌ ఇవ్వాలి. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌(బీఐఎఫ్‌) ప్రకారం 1 ఎస్‌ 4151 ప్రమాణాలతో ఉన్న ఐఎస్‌ఐ మార్కు కలిగిన హెల్మెట్లనే వాహనదారులు వినియోగించాలి. అయితే నూతన ద్విచక్ర వాహనాన్ని విక్రయించేటప్పుడు వాటికి హెల్మెట్‌లను జతచేసి ఇవ్వాలనే నిబంధనను డీలర్లు అమలు చేయడం లేదు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి షోరూమ్‌లను తనిఖీ చేసి హెల్మెట్‌లను అందిస్తున్నారా లేదా అని పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాల్సిఉంది. అలాగే వాహనదారులందరూ తప్పనిసరిగా శిరస్త్రాణాన్ని వినియోగించినప్పుడే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 26 నుంచి హెల్మెట్‌ కచ్చితంగా ధరించాలి అనే నిబంధనను పూర్తిస్థాయిలో అమలు చేస్తారో లేదో వేచి చూడాలి.

హెల్మెట్‌ లేకుంటేప్రాణాలకే ముప్పు
ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. ప్రమాదాలు జరిగిన సమయంలో తలపై గాయాలై మృతిచెందిన కేసులే అధికంగా ఉంటున్నాయి. దీనిపై ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి. హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం.– పి.మల్లికార్జునరావు,ట్రాఫిక్‌ డీఎస్పీ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top