చెట్టుకింద వైద్యం..

Healing under the trees in maidukur government Hospital YSR Kadapa - Sakshi

మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదునెలలుగా

రోగులకు తప్పని అవస్థలు పట్టించుకోని అధికారులు

మైదుకూరు టౌన్‌ : మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు  వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదు నెలలుగా ఆసుపత్రికి మరమ్మతులు జరుగుతుండటంతో పక్కనే ఉన్న ఆయుష్, క్లస్టర్‌ కార్యాలయంలోకి ఆసుపత్రిని మార్చారు. నిత్యం 300 నుంచి 320 మంది వరకు ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు.  సరైన సౌకర్యాలు లేక ఆవరణంలోని చెట్ల కిందనో, బల్లలపైనో పడుకొని చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆసుపత్రికి వచ్చే డాక్టర్లు సమయపాలన పాటించకపోవడంతో  అక్కడి కిందిస్థాయి సిబ్బంది చేసే చికిత్సతోనే సరిపెట్టుకోవాల్సి ఉంది. ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు, ముగ్గురే ఉంటున్నారు.

చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో బిజీగా ఉంటున్నారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఒక్కరు మినహా మిగిలిన వారందరూ ప్రొద్దూటూరు, కడప ప్రాంతం నుంచి రావడం గమనార్హం.  ఇక రాత్రి వేళల్లో ఒక్క నర్సు తప్ప మినహా ఏ సిబ్బంది అక్కడ అందుబాటులో ఉండరు. అంతేకాదు ఆసుపత్రిలో కనీసం విద్యుత్‌ దీపాలు కూడా ఉండవు. రాత్రి వేళల్లో గర్భిణులు ప్రసవం కోసం  వస్తే డాక్టర్లు ఎవ్వరూ లేరంటూ అక్కడ ఉన్న సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో ప్రతి నెలా 30నుంచి40వరకు కాన్పులు అయ్యే ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత 5నెలలుగా కనీసం 20కూడా కాన్పులు కాకపోవడం గమనార్హం. రోగులకు కనీస సౌకర్యాలైన బెడ్లు, మంచాలు ఏర్పాటు చేయకుండా అన్నీ ఓ గదిలో పడవేయడం ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండి వారికి వైద్య చికిత్సలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top