రాఘవుడి నామస్మరణతో శ్రీమఠం మార్మోగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్రుల జన్మదిన వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి.
మంత్రాలయం, న్యూస్‌లైన్: రాఘవుడి నామస్మరణతో శ్రీమఠం మార్మోగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్రుల జన్మదిన వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉభయ పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వేకువ జాము నుంచే శ్రీమఠంలో గురుభక్తి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చివరోజు శనివారం రాఘవేంద్రుల జన్మదినం వేడుకలు నిర్వహించారు. మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, క్షీర, మహా పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం పుష్పాలతో అలంకరించి బంగారు కవచ సమర్పణ గావించారు.
శ్రీమఠం ప్రాంగ ణంలో వేదపండితులు పఠిస్తుండగా.. మంగళవాయిద్యాల మధ్య నవరత్న రథంపై గురురాఘవేంద్రుల ప్రతిమ ఉంచారు. ఉభయ పీఠాధిపతులు నలుదిక్కులా నారీకేళ సమర్పణ, హారతులు ఇచ్చి రథోత్సవానికి అంకురార్పణ పలికారు. అశేష భక్తజనుల మధ్య రమణీయంగా రాఘవరాయలు ఊరేగారు. అంతుకు ముందు బృందావన ప్రతిమను వెండి, బంగారు పల్లకీల్లో ఊరేగించారు. తమిళనాడుకు చెందిన 500 మంది పండితులు నాదస్వరం ఆలపించారు.
గర్భాలయ శిలామంటపానికి శంకుస్థాపన :
రాఘవేంద్రుల గర్భాలయానికి శిలామంటపం నిర్మాణార్థం శనివారం ఉభయ పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభుధేంద్రతీర్థులు శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల అంచనాతో శిలా మంటపం నిర్మించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసి పనులకు అంకురార్పణ పలికారు. భక్తులు శిలా మంటప నిర్మాణానికి సహ కరించాలని పీఠాధిపతులు కోరారు. ఒక్కో శిలాఫలకం రూ.5000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. సదరు శిలపై వారి పేర్లు సైతం ముద్రిస్తామని చెప్పారు.