రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు పుట్టిన రోజు వేడుకలు
కేక్‌లు కట్ చేసిన నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు
పలుచోట్ల రక్తదానం, అన్నదానం, వైద్యశిబిరాల నిర్వహణ
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్‌వర్క్: ఈ నెల 21న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ముందస్తు వేడుకలు నిర్వహించాయి. పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటాయి. అనంతపురంలోని అంబేడ్కర్ నగర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల నేతలు వేడుకలు నిర్వహించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక, పాడేరు, అనకాపల్లిసహా పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్‌తో పాటు చీరల పంపిణీ, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. పాడేరులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దర్శి విజయశ్రీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహíÜ్తలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని సుందరమ్మ కండ్రిగ గ్రామంలో చీరలు పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు 200 మందికి పైగా రక్తదానం చేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు శిబిరాన్ని ప్రారంభించారు. బెంగళూరు వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం ప్రారంభించింది.

బెంగళూరు నగర శివార్లలోని చేతన క్రికెట్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వందలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై రూపొందించిన పాటలకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆడిపాడారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జనం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ వెంటే..: వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల అధికారంలో ఉన్నా లేకపోయినా జనం ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉంటారని.. ప్రజలకు మేలు చేయాలన్న ఆయన సంకల్పమే ఇందుకు కారణమని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కుంచనపల్లిలో శనివారం జరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీల ప్రదర్శనను ఆయన ఈ సందర్భంగా తిలకించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళి తదితర నాయకులు పాల్గొన్నారు.
40 వేల చదరపు అడుగల భారీ ఫ్లెక్సీ
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ శ్రేణులు గోదావరి నది మధ్యలోని బ్రిడ్జి లంక వద్ద వినూత్నంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. 40 వేల చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీతో పాటు.. బోట్లపై చేరిన అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కంటే వినయ్‌తేజ ఆధ్వర్యంలో చేపట్టగా, జక్కంపూడి రాజా పాల్గొని అభినందించారు.


