తిరుపతిలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లతో శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
భారీగా రక్తదాన శిబిరాలు.. స్వచ్ఛందంగా యువత రక్తదానం.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు
విద్యార్థులు, యువతకు ఆటల పోటీలు.. రైతులకు ఎడ్ల పందేలు.. జగనన్న మళ్లీ సీఎం కావాలంటూ యువత ర్యాలీలు
మీ ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయా అందరికీ కృతజ్ఞతలు
మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి గ్రామంలోనూ పండుగను తలపించేలా వేడుకలు జరుపుకొన్నారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ జిల్లా, నియోజకవర్గ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది.
యువత, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసి వైఎస్ జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. పేదలు, అనాథలకు దుస్తులు పంపిణీ చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం, కేక్‌లు పంచిపెట్టారు.

మరోవైపు పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు అవసరమైన పరీక్షలు చేసి మందులు అందించారు. నేత్ర వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. యువతకు షటిల్, క్రికెట్ పోటీలు, రైతులకు ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు.


ప్రత్యేక పూజలు.. పెద్ద ఎత్తున ర్యాలీలు..
వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు జరిపించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని, 2029లో మళ్లీ సీఎం కావాలని వేడుకున్నారు. అదేవిధంగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వైఎస్ జగన్ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా పలు ప్రాంతాల్లో యువత భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ‘జై జగనన్న.. రావాలి జగనన్న.. కావాలి జగనన్న..’ అని నినదించారు. గ్రామాల్లో జరిగిన వేడుకల్లో రైతులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని వైఎస్ జగన్ పాలనలో తమకు కలిగిన లబ్ధి గురించి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టారు.


ఇతర రాష్ట్రాలు.. దేశాల్లోనూ..
జగన్ జన్మదిన వేడుకలను దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు తెలంగాణ, తమిళ నాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ అభిమానులు ఘనంగా నిర్వహించారు. అమెరికా, లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ సహా పలు దేశాల్లోనూ వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా జరుపుకొన్నారు. గుజరాత్‌లోని మార్వాడి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్థులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
సామాజిక మాధ్యమాల్లో జగనిజం
వైఎస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షల పోస్టులతో సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. ఆదివారం ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని శనివారం నుంచే సోషల్ మీడియాలో ప్రజాభిమానం వెల్లువెత్తింది. ‘హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్’ అంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర మాధ్యమాల్లో వెల్లువెత్తిన పోస్టులు ట్రెండింగ్‌లో నిలిచాయి. అధిక వ్యూస్ సంపాదించాయి. ‘ఎక్స్’లో అయితే ‘హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ హ్యాష్‌ట్యాగ్’ టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది.
మీ ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయా: వైఎస్ జగన్
తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే విషెస్ తెలిపిన అందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు, వైఎస్సార్‌సీపీ కటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ అందరి మద్దతే నాకు గొప్ప బలం’ అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.


