‘‘నేను మారాను.. మా రాను...’ అంటే నమ్మి ఓట్లేశాం. మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన నీవు.. మా పొలాలు లాక్కొని మా పొట్టలు కొట్టేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోం’’ అంటూ గుంటూరు జిల్లా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..
తాడేపల్లి రూరల్: ‘‘నేను మారాను.. మా రాను...’ అంటే నమ్మి ఓట్లేశాం. మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన నీవు.. మా పొలాలు లాక్కొని మా పొట్టలు కొట్టేం దుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోం’’ అంటూ గుంటూరు జిల్లా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలతల్లిని నమ్ముకుని, ఆరుగాలం కష్టపడి పంటలు పండించే తమకు తల్లిలాంటి భూమిని దక్కించుకోవడ మెలాగో తెలుసని స్పష్టం చేశారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రైతులు పూలింగ్ పద్ధతిలో భూములు ఇవ్వకుంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి, భూములు తీసుకుంటామంటూ సీఎం గురువారం విజయవాడలో చేసిన ప్రకటన తాడేపల్లి ప్రాంత రైతులను ఆందోళనకు గురిచేసింది. గురువారం రాత్రి మండలంలోని కుంచనపల్లి, ప్రాతూరు, కొల నుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం గ్రామాల రైతులు కుంచనపల్లి పంచా యతీ కార్యాలయం లో సమావేశమయ్యారు. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను రియల్టర్ల కోసం లాక్కొనేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కానివారితో మీటింగ్‌లు పెడుతున్న ముఖ్యమంత్రి భూసేకరణను రైతులు వ్యతిరేకించడంతో రూటు మార్చి బెదిరింపులకు దిగారని ఆరోపించారు.