
గుడివాడ కౌన్సిల్ రసాభాస
గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిరసనలు, వాకౌట్లు, పరస్పర దూషణలతో దద్దరిల్లింది.
వైఎస్సార్‌సీపీ సభ్యులు,
అధికారులపై టీడీపీ వ్యక్తిగత దూషణలు
పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిసిన వైఎస్సార్‌సీపీ సభ్యులు
టీడీపీ సభ్యుల ఆరోపణలకు నిరసనగా అధికారుల వాకౌట్
సమావేశం నిరవధిక వాయిదా
గుడివాడ : గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిరసనలు, వాకౌట్లు, పరస్పర దూషణలతో దద్దరిల్లింది. ఒక దశలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు అసహనంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిల్ సభ్యులపై, మున్సిపల్ అధికారులపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ సభ్యురాలి తీరుపై వైఎస్సార్‌సీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు అధికారులపై టీడీపీ నాయకులు కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై మనస్తాపం చెందిన మున్సిపల్ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆ వివరాలివీ... మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని ముందుగానే ప్రకటించారు. 11వ వార్డులోని పైపులైన్ల నిర్మాణ అంశం ఎజెండాలోకి రాలేదని తెలిసి ఆ వార్డు కౌన్సిలర్ భర్త ఆబు ఆ వార్డుకు చెందిన కొందరితో, టీడీపీ కౌన్సిలర్లు, నేతలతో కలసి మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చారు. కార్యాలయానికి వస్తున్న మున్సిపల్ కమిషనర్‌ను చాంబర్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆయన చేసేది లేక చైర్మన్ చాంబర్‌లోకి వెళ్లి కూర్చున్నారు. సమావేశాన్ని ప్రారంభించేందుకు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కౌన్సిల్ హాలుకు వస్తుండగా ఆయన్నీ అడ్డుకున్నారు. మంచినీటి పైపులైను అంశం ఎజెండాలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ అంశం ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి తన వద్దకు రాలేదని, కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన సమాధానమిచ్చారు. అయినా వినని టీడీపీ నేతలు చైర్మన్‌కు, కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
దీనిపై సమాచారం అందుకుని తన సిబ్బందితో అక్కడికి చేరుకున్న పట్టణ సీఐ కె.వెంకటేశ్వరరావు ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను వారించే ప్రయత్నం చేయలేదు. దీనిపై చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లంతా కలిసి కౌన్సిల్ హాలులోకి నెట్టుకుంటూ వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు అసహనంతో ఊగిపోయి దూషణలకు దిగి, కమిషనర్ సైన్‌బోర్డు పీకేసి పడేశారు.
కౌన్సిల్ లోనూ అదే తీరు...
గంటన్నర తర్వాత ఎట్టకేలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలోనూ టీడీపీ సభ్యులు టెండరు వ్యవహారంపై గొడవకు దిగారు. వివరణ ఇప్పిస్తానని చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. టీడీపీ ప్రతిపక్ష నాయకుడు లింగం ప్రసాద్ తన మైక్ పనిచేయకపోవడంతో అసహనంతో నేలకేసి కొట్టగా, అది ముక్కలైంది. తన పేరుతో ఉన్న సైన్‌బోర్డునూ ఆయన పగలగొట్టారు. దీనిపై చైర్మన్ యలవర్తి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది కానీ ఇలా సభామర్యాదలు పాటించకుండా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. 13వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ మేరుగు మరియకుమారి మాట్లాడుతూ చైర్మన్ చెప్పినా వినకపోవడం తగదని సూచించారు. దీనిపై ఐదో వార్డు కౌన్సిలర్ చింతల వరలక్ష్మి స్పందిస్తూ ‘నీ అంతు చూస్తా.. ఏం మాట్లాడుతున్నావు..’ అని పరుషంగా మాట్లాడారు. సభలో సీనియర్, దళిత వర్గానికి చెందిన కౌన్సిలర్‌పై పరుషంగా మాట్లాడటం తగదని, వరలక్ష్మి మాటలు వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. వెనక్కి తగ్గేది లేదని వరలక్ష్మి చెప్పడంతో వారు చైర్మన్ పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు వరలక్ష్మి తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడంతో ఆందోళన విరమించారు.
అధికారులపైనా దూషణల పర్వం...
అనంతరం టీడీపీ సభ్యులు మున్సిపల్ అధికారులపైనా దూషణలకు దిగారు. అవినీతి పరులుగా మారారని ఆరోపించారు. మరికొందరు సభ్యులు కమిషనర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ స్పందిస్తూ.. అధికారులను అవినీతి పరులు అన్న అంశంపై సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం అధికారులు సమావేశానికి రాకపోవడంతో చేసేది లేక నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ యలవర్తి ప్రకటించారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్ ఎ.బాబ్జీ, అధికార పక్ష నాయకుడు ఎన్.చింతయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.