గ్రీవెన్‌‌స సెల్‌కు 214 వినతులు | Grivensa cell 214 requests | Sakshi
Sakshi News home page

గ్రీవెన్‌‌స సెల్‌కు 214 వినతులు

Jun 9 2015 1:09 AM | Updated on Sep 3 2017 3:26 AM

తన భర్త మరణించడంతో మంజూరైన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం సొమ్ము రెండేళ్లయినా నేటికీ ఇవ్వడం లేదని

విజయనగరం కంటోన్మెంట్: తన భర్త మరణించడంతో మంజూరైన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం సొమ్ము రెండేళ్లయినా నేటికీ ఇవ్వడం లేదని జామి మండలం కొత్త భీమసింగికి చెందిన లంక గురులక్ష్మి అధికారుల ఎదుట వాపోయింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్ కు 214 అర్జీలు అందాయి.  కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరావులు వినతులు స్వీకరించారు. కొత్తభీమసింగికి చెందిన గురులక్ష్మి భర్త సత్యనారాయణ 2013 జూలై18న మృతి చెందారు. దీంతో  ఆమె కుటుంబానికి రావాల్సిన పరిహారం మంజూరైంది,  కానీ ఆ పరిహారాన్ని ఇంకా ఇవ్వడం లేదనీ,  వెంటనే ఇప్పించాలని ఆమె వేడుకుంది.
 
 పక్క జిల్లాలో లేని నిబంధనలా ?
 ఆర్‌వీఎంలో ఆర్ట్, క్రాఫ్ట్ తదితర ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న వారిని స్కూళ్ల పునఃప్రారంభం నుంచి చేరాలని శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఆదేశాలు జారీ చేస్తుంటే ఇక్కడ మాత్రం మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నారని జిల్లాకు చెందిన 280 మంది ఇన్‌స్ట్రక్టర్లు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. 2015-16 సంవత్సరానికి అన్ని జిల్లాల్లో అదే సిబ్బందిని పునర్నియమిస్తున్నారని, ఇక్కడ మాత్రం వేరుగా వ్యవహరిస్తున్నారనీ వారు వాపోయారు. వెంటనే అందరితో సమానంగా దరఖాస్తు లేకుండా నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పునరుద్ధరించండి
 గంట్యాడ మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పునరుద్ధరించాలని మండల కేంద్రానికి చెందిన చప్ప స్వామినాయుడు తదితరులు గ్రీవెన్స్‌లో వినతిపత్రాన్ని అందించారు. తమ ప్రాంతంలో ఇంకా ధాన్యం నిల్వలు ఉండిపోయాయనీ, వాటిని విక్రయించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.
 
 పింఛన్లు తొలగించారు
 గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన రౌతు రమణమ్మ, చింతల సత్యవతి, డొంకాన కంచమ్మలు వితంతు, వికలాంగులనీ, వారికి ఏప్రిల్‌లో మంజూరయిన పింఛన్లను నిలిపివేశారని ఎంపీటీసీ సభ్యుడు పీరుబండి జైహింద్‌కుమార్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.  నిరుపేదలైన వారి పింఛన్లు ఇచ్చేలాచర్యలు తీసుకోవాలని  కోరారు.
 
 వీఆర్వో తప్పుడు నమోదు చేశారు
 విజయనగరం మండలం జమ్మునారాయణ పురం సర్వేనంబర్ 148/4లో తనకు, తన తమ్ముడు కుమార్తెకు కలిపి  ఉన్న 37 సెంట్ల వారసత్వ భూమిని గ్రామ వీఆర్వో సమానంగా పంచకుండా తప్పుడు ధ్రువీకరణ చేయించారని గ్రామానికి చెందిన భోగాపురపు ఆదినారాయణ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement