శభాష్‌ వలంటీర్‌ 

Grama Volunteer Helps Pregnant Lady In Visakhapatnam District - Sakshi

12 కిలోమీటర్ల కొండమార్గంలో డోలీమోత 

ఆస్పత్రికి గర్భిణి తరలింపు

శిశువు మృతి.. తల్లి క్షేమం 

సాక్షి, ముంచంగిపుట్టు (అరకు): ఆమె నిండు గర్భిణి. పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేదు.. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో భగవంతుడిలా ప్రత్యక్షమయ్యాడు.. ఆ గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణభిక్ష పెట్టాడు. ఆస్పత్రికి చేరడం ఆలస్యం కావడంతో మృత శిశువు జన్మించింది. ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉంది. విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన బుద్రి అనే నిండు గర్భిణికి మంగళవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేని ఆ గ్రామం నుంచి ఆమెను ఎలా ఆస్పత్రికి తరలించాలో తెలియక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు. (వైజాగ్‌ని చాలా మిస్‌ అవుతున్నా..)

విషయం తెలుసుకున్న గ్రామ వలంటీర్‌ సుబ్బారావు ముందుకొచ్చి డోలీ కట్టించి కుటుంబ సభ్యులతో బయల్దేరాదు. పన్నెండు కిలోమీటర్ల అటవీ కొండ ప్రాంతాన్ని దాటుకొని.. జోరు వానలో గర్భిణి తడిసి పోకుండా కవర్లు కప్పి  లక్ష్మీపురం వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు సదుపాయం ఉండటంతో అక్కడి నుంచి 108లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమై మృత శిశువుకు జన్మనిచ్చింది. కొండ మార్గంలో మైళ్ల దూరం ప్రయాణం చేసి ఆస్పత్రికి సకాలంలో చేరకపోవడం వల్లే బిడ్డను పోగొట్టుకున్నామని బుద్రి కుటుంబ సభ్యులు వాపోయారు. ముందుగానే ఆస్పత్రిలో చేరాలని సూచించినా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వలంటీర్‌ సుబ్బారావు అన్నాడు. (మిగతా రాష్ట్రాలకంటే మిన్నగా ఉన్నాం )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top