షెడ్యూల్‌ మారింది..

Grama Sachivalayam Final Merit List Delay In Srikakulam - Sakshi

కొత్త మార్గదర్శకాలతో  స్వల్ప మార్పులు

నేటి నుంచి అభ్యర్థులకు కాల్‌లెటర్ల జారీ

ఈనెల 25 నుంచి 27 వరకు వెరిఫికేషన్‌ ప్రక్రియ

28, 29 తేదీల్లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు

రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా తుది జాబితాను తయారు చేసే క్రమంలో కొంత జాప్యం జరిగింది.. అభ్యర్థుల ప్రాధాన్యత పోస్టుల ఎంపికను పరిగణనలోకి తీసుకోవడం కూడా ఆలస్యానికి కారణం.. కచ్చితత్వం కోసం అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. వేకువజామున 4 గంటల వరకు కార్యాలయంలోనే గడిపిన కలెక్టర్, జేసీ తదితర జిల్లా అధికారులు ఆదివారం కూడా కసరత్తు కొనసాగించారు. మత్స్య, పశుసంవర్ధక, ఉద్యానవన, సెరికల్చర్‌ తదితర శాఖల ఉద్యోగాలకు లైన్‌క్లియర్‌ కావడంతో ముందు వాటి ప్రక్రియను చేపడుతున్నారు.

సాక్షి, అరసవల్లి: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల రాత పరీక్షలో అర్హత సాధించిన వారిలో రోస్టర్‌ ప్రకారం 1ః1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులకు నేటి (సోమవారం) నుంచి కాల్‌లెటర్లు జారీ చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాపరిషత్‌ కార్యాలయంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా తుది జాబితాను తయారు చేసే క్రమంలో అభ్యర్థుల ప్రాధాన్యత పోస్టుల ఎంపిక విషయంలో కొంత జాప్యం జరిగిందని వివరించారు. ఆదివారం ఉదయం నుంచి పలు శాఖల నుంచి తాజా జాబితాలు సిద్ధమయ్యాయన్నారు. అర్హత గల ఏ అభ్యర్థికీ అన్యాయం జరుగకుండా మొత్తం 835 గ్రామ, 95 వార్డు సచివాలయాల్లో 7884 పోస్టుల భర్తీకి తాము అన్ని రకాలుగా చర్యలు చేపట్టామన్నారు.

ఈ కారణంతోనే వెరిఫికేషన్‌ ప్రక్రియను కూడా వెనక్కు జరిపామని, ఈనెల 25 నుంచి 27 వరకు సర్టిఫికేట్ల చేపట్టనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి తక్కువ పోస్టులున్న పలు శాఖలకు సంబంధించి.. అర్హులైన వారికి కాల్‌లెటర్లు పంపించారని, అయితే వీటిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తాజాగా మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, సెరికల్చర్‌ తదితర శాఖల ఉద్యోగాలకు అంతా లైన్‌ క్లియర్‌ అయ్యిందని.. అందుకే ఈ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముందుగా సోమవారం నుంచే కాల్‌లెటర్లు జారీ చేస్తామని, అలాగే వీరికే ముందుగా ఈనెల 25న వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నామన్నారు. ఇక మిగిలిన శాఖల్లో ఎంపికైన వారికి కూడా కాల్‌లెటర్లను జారీ చేస్తామని, వారు కూడా వెంటనే సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సచివాలయ పోస్టుల ప్రక్రియపై పలు ముఖ్య విషయాలను కలెక్టర్‌ వివరించారు.

అప్‌లోడ్‌కు సిద్ధం కండి...!
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు క చ్చితంగా కాల్‌లెటర్లను సోమవారం ఉదయం నుంచి మెయిల్‌ లేదా ఫోన్‌ సమాచారం ద్వారా పంపిణీ చేస్తామని కలెక్టర్‌ తెలియజేశారు. అయితే ఇందుకోసం ముందుగా పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, సె రికల్చర్, మత్స్యశాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారు ఎవరి ధ్రువపత్రాలను వారే స్వయంగా సచివాలయ వెబ్‌సైట్‌లో ఈనెల 23, 24 తేదీల్లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఉద్యోగానికి ఎంపిౖMðన వారికి మాత్రమే అప్‌లోడ్‌ ఆప్షన్‌ ఓపెన్‌ అవుతుందన్నారు. పశుసంవర్ధక శాఖలో మొత్తం 792 పోస్టులకు 233 మంది రాత పరీక్షలో అర్హత సాధించగా, ఇందులో 212 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలియజేశారు. మత్స్యశాఖలో 67 పోస్టులకు 218 మంది అర్హులు కాగా, కేవలం 55 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ఉద్యానవన శాఖలో మొత్తం 155 పోస్టులకు 272 మంది అర్హులు కాగా, కేవలం 118 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

వీరికి సోమవారం ఉదయం నుంచే కాల్‌లెటర్లు జారీ చేస్తామని, అయితే వీరిలో కొందరికి శనివారం రాత్రి కాల్‌లెటర్లను పంపించామని, వాటిని కాకుండా ఈనెల 25న వెరి ఫికేషన్‌ తేదీ అంటూ.. కొత్తగా జారీ చేసిన కాల్‌లెట ర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఇక మిగిలిన శాఖల్లో  ప్రాధాన్యత పో స్టుల ఎంపిక విషయంలో ప్రక్రియకు కొంత జాప్యం జరగడంతో తుది జాబితా సిద్ధం కాగానే వారికి కూడా కాల్‌లెటర్లు పంపిస్తామని, అలాగే వీరికి వెరిఫికేషన్‌కు ఈనెల 26, 27 తేదీల్లో సిద్ధం చేస్తామన్నారు. ఏఎన్‌ఎం నియామకాలు ఆలస్యమయ్యే అవకాశముందన్నారు. 

వెరిఫికేషన్‌ కేంద్రాలు సిద్ధం
ఈనెల 25 నుంచి 27 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను శ్రీకాకుళం రూరల్‌ మండలం మునసబుపేట గాయత్రి డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీశివా ని, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల్లో నిర్వహించేందుకు జిల్లా ఎంపిక కమిటీ నిర్ణయించిందని కలెక్టర్‌ ప్రకటించారు. ఈ కేంద్రాల్లో ఈమేరకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలియజేశారు.

ఈనెల 28, 29 తేదీల్లో అపాయింట్‌మెంట్లు
సచివాలయాల పోస్టుల భర్తీలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 28, 29 తేదీల్లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ చేయనున్నామని కలెక్టర్‌ తెలియజేశారు. మొత్తం 835 గ్రామ సచివాలయాల్లో 7326 పోస్టులను భర్తీ చేయనున్నామని, వీరికి జిల్లా కలెక్టర్‌ ద్వారానే ఆర్టర్లు జారీ అవుతాయని, అలాగే జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ, రాజాంలలో మొత్తం 95 వార్డు సచివాలయాల్లో మొత్తం 558 ఉద్యోగాలకు మున్సిపల్‌ రీజనల్‌ డైరక్టర్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ అవుతాయన్నారు. 

మిగిలిన పోస్టులకు అక్టోబర్‌ 15 తర్వాత నోటిఫికేషన్‌
మిగిలిపోయిన పోస్టుల కోసం అక్టోబర్‌ 15 తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కలెక్టర్‌ చెప్పారు. ఒక పోస్టుకు మించి అదనపు విభాగాల్లో ఎంపికైన సందర్భాల్లోనూ, కేటగిరి–1లో నాలుగు పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించిన సందర్భంలోనూ.. ప్రాధాన్యతగా ఎంపిక చేసుకున్న అభ్యర్థికి పోస్టును కేటాయించగా మిగిలిపోయిన పోస్టులను రోస్టర్‌ ప్రకారం జాబితాలో ఉన్న అభ్యర్థులకు కేటాయిస్తామన్నారు. దీంతో పోస్టులు ఖాళీగా ఉండే అవకాశముండదన్నారు. అయితే పలు శాఖల్లో పోస్టుల సంఖ్య కంటే రాత పరీక్షలో అర్హుల సంఖ్య తక్కువగా ఉన్నారని, ఇలాంటి సందర్భంలో మిగిలిపోయిన ఖాళీలను మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

జెడ్పీలో బిజీబిజీ
సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియను అధికార యంత్రాంగం రాత్రనక పగలనక నిర్వహిస్తోంది. క్లర్కుల కుర్చీల్లో కూర్చుని కలెక్టర్, జేసీ, డీఆర్వో పనిచేయడం ఆశ్చర్యపరిచింది.  జిల్లా పరిషత్‌లో శని, ఆదివారాల్లో ఉన్నతాధికారులు తీవ్రంగా శ్రమించారు. ఎలాగైనా ప్రతి ఒక్క అర్హునికి న్యాయం జరిగేలా.. పక్కాగా, పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌ నివాస్, జేసీ శ్రీనివాసులు, డీఆర్వో దయానిధి, డీపీవో రవికుమార్, నగర కమిషనర్‌ గీతాదేవి తదితర జిల్లా అధికారులు తీవ్రంగా శ్రమించారు.

వెరిఫికేషన్‌కు ఇవి కావాలి..
పరీక్షకు సంబంధించిన ఒరిజినల్‌ హాల్‌టికెట్‌
► రెండు ఫొటోలు, రెండు సెట్ల విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్‌ సెట్లు
► అభ్యర్థి ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్లతో దరఖాస్తు చేసుకున్న అనంతరం డౌన్‌లోడ్‌ చేసిన పత్రం
► విద్యార్హతలకు సంబంధించి ఒరిజినల్‌ సర్టిఫికేట్లు
► 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
► స్కూల్‌ లేదా కాలేజీలో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ చదివిన అభ్యర్థులు నివాస ధ్రువీకరణ పత్రం (తహశీల్దార్‌ జారీ చేసిన)
► రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారి స్థానికతకు సంబంధించిన లోకల్‌ స్టేటస్‌ సర్టిఫికేట్‌
► బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారు కుల ధ్రువీకరణ పత్రం (తహశీల్దార్‌ జారీ చేసిన)
► బీసీ అభ్యర్థులకు నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికేట్‌ (తహశీల్దార్‌ మాన్యువల్‌గా జారీ చేసిన)
► దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన సర్టిఫికేట్‌
► ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత అధికారులచే ధ్రువీకరణ
► ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విధానాల్లో పనిచేస్తూ వెయిటేజ్‌ పొంది, ఎంపికైన వారు తమ శాఖాధిపతుల నుంచి ఇన్‌సర్వీస్‌ సర్టిఫికేట్‌ 
► దీంతోపాటు తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ, దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఇది వైఎస్‌ జగన్‌ పుణ్యమే..
కవిటి: ‘ఉద్యోగం కోసం యజ్ఞంలా శ్రమించి చదివాను. గడచిన ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ మినహా అనుకున్నస్థాయి నోటిఫికేషన్లేవీ వెలువడలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఉద్యోగ విప్లవం నాలాంటి వారెందరికో ఉపాధి కల్పిస్తోంద’ని కవిటి మండలం జగతికి చెందిన వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ విభాగంలో జిల్లా టాప్‌ ర్యాంకర్‌ పులకల హరిప్రసాద్‌ అన్నారు. ప్రశ్నపత్రం తయారీలోనే కఠినత్వ స్థాయి, ప్రమాణత, పారదర్శకత లక్ష్యాల మేరకు ఉండడంతో పరీక్ష రాయడంలో ఎంతో సంతృప్తి చెందానన్నారు. గ్రూప్‌1, గ్రూప్‌2 పరీక్షల కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఈ పరీక్ష రాశానని, రైతు కుటుంబంలో పుట్టిన తనకు ఈ అవకాశం రావడం నిజంగా వైఎస్‌ జగన్‌ పుణ్యమేనన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top