3 లక్షల మంది టీచర్లకు సర్కారు షాక్ | government shocks to teachers | Sakshi
Sakshi News home page

3 లక్షల మంది టీచర్లకు సర్కారు షాక్

Oct 21 2013 3:33 AM | Updated on Oct 16 2018 6:27 PM

పంచాయతీరాజ్, మున్సిపల్ స్కూళ్లలో పని చేస్తున్న దాదాపు 3 లక్షల మంది ఉపాధ్యాయులకు సర్కారు షాకిచ్చింది.

 సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, మున్సిపల్ స్కూళ్లలో పని చేస్తున్న దాదాపు 3 లక్షల మంది ఉపాధ్యాయులకు సర్కారు షాకిచ్చింది. హాఫ్ పే లీవ్  ఎన్‌క్యాష్‌మెంట్ సదుపాయం వారికి వర్తించబోదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు కానందున వారికి ఈ సదుపాయాన్ని వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. దాంతో వారంతా లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లా కాకుండా మెమో రూపంలో సెకండరీ విద్యా శాఖ జారీ చేసిన ఈ ఆదేశాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక శాఖ అనుమతితోనే ఉత్తర్వులు జారీ చేసినట్టు అందులో పేర్కొంది. భవిష్యత్తులో నియమితులయ్యే టీచర్లకు కూడా ఈ సదుపాయం వర్తించబోదు!
 
 హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటే: టీచర్లకు ఏటా 20 చొప్పున అర్ధ వేతన సెలవులు (హాఫ్ పే లీవ్స్) ఉంటాయి. రిటైరయ్యాక/మరణించాక గరిష్టంగా 300 హాఫ్ పే లీవ్స్‌ను సరెండర్ చేస్తే 150 రోజుల పూర్తి వేతనాన్ని సదరు టీచర్‌కు/కుటుంబీకులకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ సదుపాయం ద్వారా సర్వీసులో మరణించిన ఉపాధ్యాయుని కుటుంబీకులు కూడా లబ్ధి పొందుతూ వస్తున్నారు. రాష్ట్రంలో 3.5 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులుంటే వారిలో ఏకంగా 3 లక్షల మంది మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పరిధి స్కూళ్లలోనే పని చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో 90 శాతం పంచాయతీరాజ్ స్కూళ్లే. కేవలం 10 శాతమున్న ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు 50 వేల మంది ఉంటారు. చాలా ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ సదుపాయానికి ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టడంపై పంచాయతీరాజ్, మున్సిపల్ స్కూళ్ల టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేం కూడా ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ ద్వారానే ఎంపికయ్యాం. విద్యా శాఖ పంపితేనే పంచాయతీరాజ్, మున్సిపల్ స్కూళ్లలో పని చేస్తున్నాం. ఈ పథకానికి ఎలా అనర్హులమవుతాం?’’ అని ప్రశ్నిస్తున్నారు.
 
 ప్రాధాన్యమిచ్చిన పీఆర్సీ: టీచర్లకు గత పీఆర్సీ ఎంతో ప్రాధాన్యమిచ్చింది. దాని సిఫార్సుల మేరకు వారికి ప్రభుత్వం వేతనాలు పెంచింది కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లు, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో పని చేసే వారికి పీఆర్సీ వేర్వేరుగా వేతనాలను సిఫార్సు చేయలేదు. కేటగిరీ ప్రకారం స్కేళ్లను నిర్ధారించింది. అలాగే హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను కూడా సిఫార్సు చేసింది. ఉత్తర్వులనే తుంగలో తొక్కిన ఆర్థిక శాఖ: పంచాయతీరాజ్ టీచర్లకు, మున్సిపల్ టీచర్లకు పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సదుపాయం వర్తించదన్న ఆర్థిక శాఖే పీఆర్సీ సిఫార్సుల ప్రకారం ఉద్యోగులందరికీ ఈ సదుపాయాన్ని వర్తింపజేస్తూ 2010 మే 4న జీవో 154 జారీ చేసింది. ఈ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు మాత్రమేనని అందులో ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడిలా తన ఉత్తర్వులను తానే తుంగలో తొక్కింది.
 
 వెంటనే పునరుద్ధరించాలి: పీఆర్‌టీయూ
 పంచాయతీరాజ్, మున్సిపల్ టీచర్లకు హాఫ్‌పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సదుపాయాన్ని వెంటనే పునరుద్ధరించాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సరోత్తమ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సదుపాయాన్ని రద్దు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలన్నారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇలా టీచర్లకు నష్టం కలిగించే చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం దారుణమని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement