ఈసీ అనుమతి తర్వాతే తుది ఫలితం 

Gopalakrishna Dwivedi revealed comments about final results - Sakshi

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడి  

రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటనకు అనుమతి అక్కర్లేదు 

350 కౌంటింగ్‌ హాళ్లలో 25 వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు  

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం  

ఓట్ల లెక్కింపు విషయంలో పుకార్లు నమ్మొద్దు  

సాక్షి, అమరావతి:  రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. కానీ, తుది ఫలితాన్ని మాత్రం ఈసీ అనుమతి తర్వాతే ప్రకటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్‌ హాళ్లలో 25,000 మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాజకీయంగా చాలా సున్నితమైన రాష్ట్రం కావడంతో ఏపీకి కేంద్రం 10 కంపెనీల అదనపు బలగాలను పంపిస్తోందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 45 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.05 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేయగా, 21వ తేదీ నాటికి 2.62 లక్షలు ఆర్వోలకు చేరాయని, అలాగే 60,250 సర్వీసు ఓటర్లకు గాను 30,760 ఓట్లు చేరినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు భారీగా ఉండటంతో వీటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా అదనపు టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు.  

రాజకీయ పార్టీలు సహకరించాలి  
‘‘ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాల ట్రెండ్‌పై ఒక స్పష్టత వస్తుంది. రాత్రికల్లా అధికారికంగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన నిబంధనలు, విధివిధానాలపై సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చాం. ఈవీఎంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచాం. కౌంటింగ్‌ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి టేబుల్‌ వద్ద ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. ఓట్ల లెక్కింపు విషయంలో పుకార్లు, వదంతులను నమ్మొద్దు.

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా సహకరించాలని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. కొన్నిచోట్ల నేరచరిత్ర ఉన్న వారిని కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించినట్లు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించి, నేర చరిత్ర ఉన్న వారిని తొలగించాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశాం. నేర చరిత్ర ఉన్న వారిని ఏజెంట్లుగా చివరి నిమిషంలో కూడా తిరస్కరించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు ఎలాంటి ఆరోపణలు లేని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకోవాలి’’ అని ద్వివేది సూచించారు.  

ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించం  
‘‘కౌంటింగ్‌ ఏజెంట్లు లెక్కింపు కేంద్రాల్లోకి వారితో పాటు తీసుకెళ్లే వస్తువులను నిర్ధారిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఏజెంట్లు కేవలం పెన్ను/పెన్సిల్, తెల్ల కాగితాలు/నోట్‌ ప్యాడ్, ఫారం–17సీ, పోలింగ్‌ ముగిసిన తర్వాత సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి చెందిన ప్రిసైడింగ్‌ అధికారి జారీ చేసిన డూప్లికేట్‌ కాపీలను తీసుకెళ్లాలి. ప్రిసైడింగ్‌ అధికారి జారీ చేసిన ఫారం–17సీని కౌంటింగ్‌ హాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఉపయోగపడేలా, సరి చూసుకొనేందుకు అనుమతిస్తాం. సెల్‌ఫోన్‌తో సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదు’’ అని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top