హోంగార్డులకు తీపి కబురు

Good News For Home Guards  - Sakshi

వేతనాలు పెంచిన ప్రభుత్వం

జిల్లాలో 765 మందికి ప్రయోజనం

సుప్రీం కోర్టు ఆదేశాలతో హోంగార్డులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై శ్రీకాకుళం జిల్లాకు అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. హోంగార్డులకు వేతనాల పెంపు నిర్ణయంతో జిల్లాలో 765 మందికి ప్రయోజనం కలగనుంది. వీరిలో 78 మంది మహిళా హోంగార్డులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డులకు వాస్తవానికి రోజువారి కనీస వేతనం రూ. 679 ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 400 మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. తాజా నిర్ణయంతో రోజువారీ వేతనం మరో రూ. 200 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ. 600 వేతనాన్ని ఇక నుంచి తీసుకోనున్నారు.

 వేతనం పెంపుదలతో పాటు హోంగార్డులకు మూడునెలల పాటు మెటర్నిటీ సెలవులు, నెలలో రెండురోజుల వేతనంతో కూడిన సెలవులు, ఎన్‌టీఆర్‌ వైద్యసేవలో భాగంగా రూ. 2.50 లక్షల మేర వైద్యసహాయం, సహజమరణానికి రూ. 5 లక్షలు, దహణ సంస్కారాలకు రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని హోంగార్డు ఆర్‌ఐ శ్రీనివాస్‌కుమార్, జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు.

మాపై బాధ్యత మరింత పెరిగింది
వేతనాలు పెంచడం సంతోషం. మాపై బాధ్య త మరింత పెరిగింది. ఇప్పటికే తక్కువ వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం రోజుకు రూ. 400 వరకు వేతనం ఇస్తున్నారు. తాజా నిర్ణయంతో  రూ. 600 తీసుకోనున్నాం. పెంచిన వేతనాలు త్వరగా అమలుజరిగేలా చర్యలు చేపట్టాలి. 
– గిరిపండా, 
హోంగార్డు డ్రైవర్, శ్రీకాకుళం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top