ఆపరేషన్‌ ‘రాయల్‌ వశిష్ట పున్నమి’కి ఆటంకాలు

Godavari Boat Accident Disturbance For Operation Royal Vashishta Punnami - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసేందుకు చేపట్టిన ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం సంప్రదాయ పద్ధతిలో ఇనుప తాడు, ఇనుప కొక్కేలు, లంగరుతో నిర్వహించాల్సిన ప్రక్రియ శుక్రవారం ప్రారంభించడానికి వీలుపడలేదు. 25 టన్నుల బరువైన బోటును 214 అడుగుల లోతు నుంచి బయటకు తీసుకురావాలంటే 100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ క్రేన్‌ లేదా బుల్‌డోజర్‌ అవసరం. భారీ క్రేన్‌ను బోటు మునిగిపోయిన ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, దేవీపట్నం ఫెర్రీ పాయింట్‌ నుంచి మంటూరు దాకా 8 కిలోమీటర్లు, మంటూరు నుంచి దేవుడిగొంది వరకు 5 కిలోమీటర్లు రహదారి ఇందుకు ఏమాత్రం అనువుగా లేదు.

4 అడుగులు వెడల్పైన ఈ రోడ్డు ఎగుడుదిగుడుగా ఉంది. భారీ క్రేన్‌ను 10 టైర్ల లారీలోకి చేర్చి, ఆ కొండ రోడ్డు నుంచి ఘటనా స్థలానికి దగ్గర్లోని ఇసుక తిన్నెలపైకి తీసుకురావడం అసాధ్యమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రోడ్డును  10 అడుగుల వెడల్పు రహదారిగా విస్తరిస్తే గానీ క్రేన్‌ తీసుకురావడం కష్టమని తేల్చారు. ముంబయి మెరైన్‌ మాస్టర్స్‌కు చెందిన గౌర్‌బక్సీ ఆధ్వర్యంలోని బృందం తీసుకెళ్లిన ఛాయాచిత్రాల నివేదిక శుక్రవారం జిల్లాకు రాలేదు. బోటు వెలికితీత ఆపరేషన్‌ నిర్వహించేందుకు భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై బక్సీ నివేదిక కోసం ఎదురుచూశారు. ఆ నివేదిక శనివారం నాటికి వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చెప్పారు.

బోటులో పదికి పైగా మృతదేహాలు!
బోటు ప్రమాదంలో గల్లంతైన వారిని వెలికితీసేందుకు అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బోటు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించిన సుడిగుండాలున్న పరిసర ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వస్తోంది. అటువైపు వెళ్లేందుకు మత్స్యకారులు సైతం సాహసం చేయలేకపోతున్నారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు కావడంతో బోటు లోపల ఏసీ క్యాబిన్‌లో చిక్కుకున్న మృతదేహాలు పూర్తిగా పాడైపోవడంతోనే దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. గోదావరిలో మునిగిపోయిన బోటులో 10కి పైగానే మృతదేహాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బోటు మునిగిపోయినప్పుడు ఏసీ క్యాబిన్‌లో ఒక జంట, వాష్‌రూమ్‌లో ఒకరు, కింద హాలులో ఏడుగురు ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చులూరు మందం వద్ద సంఘటనా స్థలం, దేవీపట్నం ఫెర్రీ పాయింట్‌లో 144 సెక్షన్‌ను అధికారులు అమలు చేస్తున్నారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మచిలీపట్నం పోర్టు అధికారి ఆదినారాయణను ప్రభుత్వం నియమించింది. ఆయన శుక్రవారం రాత్రి ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top