వేరబుల్స్ బ్రాండ్ ‘బోట్’ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి సంబంధించి అప్‌డేట్ చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (యూడీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. దీని ప్రకారం కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 1,000 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నారు.
తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 225 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రూ. 150 కోట్ల మొత్తాన్ని బ్రాండ్..మార్కెట్ వ్యయాల కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. 2013లో అమన్ గుప్తా, సమీర్ మెహతా ప్రారంభించిన బోట్ సంస్థ ఆడియో పరికరాలు, స్మార్ట్ వేరబుల్స్, మొబైల్ యాక్సెసరీలు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 60 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ కోసం బోట్ ప్రయత్నించడం ఇది రెండోసారి. రూ. 2,000 కోట్ల ఐపీవో కోసం 2022 జనవరిలో ముసాయిదా పత్రాలు సమర్పించింది. అప్పట్లో రూ. 900 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేసేట్లు, ఓఎఫ్‌ఎస్ కింద రూ.1,100 కోట్ల షేర్లు విక్రయించేట్లు ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు


